అదృష్టం ఎందులో ఉంది?

అనగనగా ఓ పేదవాడు ఉండేవాడు. అతనికి తన జీవితం అంటే ఏమాత్రం ఆశ ఉండేది కాదు. తనో నష్టజాతకుడిననీ, ఎందుకూ పనికిరానివాడిననీ అతని నమ్మకం. ఏ పని చేసినా ఫలితం ఉండదని నమ్మడంతో ఎలాంటి పనీ చేసేవాడు కాదు. అతని ఇల్లు కూడా అతని మనసులాగానే ఉండేది. ఇంటినిండా బూజు, మూలమూలలా సాలీడు గూళ్లూ, మురికీ మురుగూ… నష్టజాతకునికి తగినట్లుగా ఉండేది ఆ ఇల్లు. ఓ రోజు తన స్నేహితుడి ఇంటికి ఎవరో స్వామీజీ వచ్చారని తెలిసింది నష్టజాతకునికి. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి `స్వామీ తమరు మా ఇంటికి కూడా వేంచేయండి. మీ కాలి ధూళి సోకితేనన్నా నా ఇంటికి సిరిసంపదలు వస్తాయేమో` అని వేడుకున్నాడు.

స్వామీజీ నష్టజాతకుని ఇంటికి రానేవచ్చారు. అతని ఇంటిని చూడగానే ఆయన మొహంలో ఓ చిరునవ్వు విరిసింది `స్వామీ చూస్తున్నారుగా నా దరిద్రం. ఈ దరిద్రం దూరమయ్యేలా ఏదన్నా వరాన్ని అనుగ్రహించండి` అని వేడుకున్నాడు పేదవాడు. స్వామీజీ చిరునవ్వుతో ఓ అందమైన గాజుపాత్రని ఇచ్చి `ఇది నీ ఇంట్లో ఉంచుకుని పనికి వెళ్లు. సకల శుభాలూ చేకూరతాయి`అని చెప్పాడు. ఆ గాజుపాత్రని చూసిన పేదవాడి కళ్లు గాజులా మెరిశాయి. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచి పని వెతుక్కుంటూ ఊళ్లోకి వెళ్లాడు. ఉదయాన్నే ఉత్సాహంతో ఎదురుపడిన అతణ్ని చూసి ఎవరో ఓ కూలి పనిని అప్పగించారు. ఎన్నో రోజుల తరువాత తనకు పని దొరకడంతో ఒళ్లు వంచి ఆ పనిని సమర్థంగా పూర్తిచేశాడు పేదవాడు. తను అంత బాగా పనిచేయగలనని అప్పటిదాకా అతనికి కూడా తెలియదయ్యే! తన ఇంట్లో ఉంచిన గాజుపాత్రకి నిజంగానే మహిమ ఉందన్న నమ్మకం ఏర్పడింది అతనికి. ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తిచేయడంతో రూపాయికి మరో రూపాయి అదనంగా ఇవ్వడమే కాకుండా, మర్నాడు కూడా రమ్మని చెప్పాడు యజమాని.

విజయహాసంతో ఇంటికి వచ్చిన పేదవాడు ఆ గాజుపాత్ర వంక ప్రేమగా చూశాడు. అది ఓ మురికి పట్టిన టీపాయి మీద ఉందన్న విషయం అప్పటికి కానీ అతని స్ఫురణలోకి రాలేదు. వెంటనే ఆ గదిని శుభ్రం చేసి, బూజు దులిపి, గాజు పాత్రలో ఓ నాలుగు పూలని అందంగా అమర్చి చూసుకున్నాక కానీ అతనికి తృప్తిగా అనిపించలేదు. ఆ తరువాత అలసిసొలసి నిద్రపోయాడు. మర్నాటి నుంచి అతని జీవితమే మారిపోయింది. అతని ఉత్సాహం, శ్రద్ధ రెండోరోజు కూడా గమనించిన యజమాని తన దగ్గరే శాశ్వతంగా పనిలోకి పెట్టుకున్నాడు. రోజూ ఉదయాన్నే ఒళ్లు వంచి పనిచేయడం, సాయంత్రం వేళకు ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చేసేవాడు పేదవాడు. తన ఇల్లు చాలా అందమైనదన్న విషయం అతనికి, దాన్ని శుభ్రపర్చుకున్నాక కానీ తెలిసిరాలేదు. ఆదివారం ఆదివారం ఆ ఇంటికి నలుగురు స్నేహితులనూ ఆహ్వానించేవాడు. ఆ రోజంతా విందు, వినోదాలతో మునిగిపోయేవాడు. ఇప్పటికీ అతను చాలామందితో పోలిస్తే పేదవాడే, కానీ తనకి ఏదో లోటు ఉందన్న విషయం అతనికి తోచేది కాదు.

ఓ రోజు అనుకోకుండా ఆ గాజు పాత్ర పగిలిపోయింది. అంతే! ఈ దెబ్బతో తన అదృష్టం మాయమైపోతుందని భయపడిపోయాడు పేదవాడు. వెంటనే ఆ స్వామీజీని వెతుక్కుంటూ బయల్దేరాడు. వారం రోజుల పాటు నిద్రాహారాలు మానివేసి, వాకబు చేసుకుంటూ తిరిగితే కానీ అతనికి స్వామీజీ జాడ తెలియలేదు. `స్వామీ మీరు నాకు బహుమతిగా ఇచ్చిన గాజు పాత్ర పగిలిపోయింది. నన్ను క్షమించి, నాపై కరుణ ఉంచి, నాకు మళ్లీ అదృష్టాన్ని కలిగించే మరో పాత్రను ఇయ్యండి` అని వేడుకున్నాడు.

పేదవాడి వంక చిరునవ్వులు చిందిస్తూ స్వామీజీ అన్నాడు కదా `నేను నీకు ఇచ్చిన గాజుపాత్రలో ఎలాంటి అదృష్టమూ లేదు నాయనా! నువ్వు విజయం సాధిస్తావన్న నమ్మకాన్ని కలిగించడం కోసం అది ఒక సాకు మాత్రమే! ఒక్కసారి అప్పటి నుంచి జరిగిన సంఘటనలను ఊహించుకుని చూడు. నీ జీవితం బాగుపడింది ఆ గాజుపాత్ర వల్లో, లేకపోతే మారిన నీ దృక్పథం వల్లో నీకే అర్థమవుతుంది!`ఆ మాటలు విన్న పేదవాడు తిరిగి తన ఇంటికి బయల్దేరాడు. అతనికి ఇప్పడు అదృష్టాన్ని కలిగించే గాజుపాత్ర అవసరం లేదు. ఎందుకంటే ఆ గాజుపాత్ర ఇప్పుడు అతని హృదయంలో ఉంది. పైగా అది పగిలే అవకాశం కూడా లేదు!