వేసవిలో వేడి దెబ్బ కొట్టేస్తుందని భయమా.. అయితే మీకోసమే ఇవి!
posted on Apr 6, 2023 9:30AM
వేసవి కాలం వచ్చేసింది హైడ్రేటెడ్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉందిప్పుడు. బయటకు వెళితేనే కాదు.. ఇంట్లో ఉన్నా ఇప్పటికాలంలో ఉన్న అగ్గిపెట్టల్లాంటి ఇళ్లలో, గాలి వెళుతూ సరిగా లేక శరీరంలో తేమశాతం చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ వేసవిలో శరీరానికి ఎక్కువ ద్రవపదార్థాలు అవసరమవుతాయి, ఎందుకంటే పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడతుంది. ఈ సమస్య అధిగమించడానికి నీరు ఎక్కువగా తాగాలని చెబుతారు. ఎంత నీరు తాగితేనేం.. నిమిషాలు కూడా గడవకముందే మళ్ళీ దాహం వేస్తుంది, నోరు పిడచకట్టుకుపోతుంది. చల్లగా, హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు కాకుండా అనేక ఆప్షన్స్ ఉన్నాయి. రుచికి రుచి, శక్తికి శక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంతకంటే కావాల్సిందేముంది?? ఈ వేసవిలో మిస్ చేసుకోకూడని.. టాప్ 5 బెస్ట్ డ్రింక్స్ ఇవి.. మీరూ వీటిని ట్రై చేసి చక్కగా హాయిగా ఉండండి.
సత్తు
తెలుగు వారికి ఇది కాస్త కొత్తే.. ఇది బీహార్ రాష్ట్ర పానీయం. దీన్ని పేదవాడి ప్రోటీన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ ఒక్కమాటతో ఇది ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సత్తు డ్రింక్ ను దేశ వ్యాప్తంగా తాగుతున్నారు. ఇందులో ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది, ఇది మీకు వేగవంతమైన శక్తిని అందించడంతో పాటు కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో కరగని ఫైబర్స్ ఉండటం వల్ల ఇది ప్రేగులకు కూడా మంచిది. గ్యాస్, మలబద్ధకం, ఆమ్లతను కూడా నియంత్రిస్తుంది, ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. శనగపిండితో తయారు చేసే ఈ సత్తు పానీయం చాలా శక్తివంతమైంది.
మజ్జిగ..
అల్లం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కాస్త మిర్చితో పోపు వేసిన మజ్జిగ తెలుగువారికి చాలా ఇష్టమైనది. ఈ మజ్జిగను కుండల్లో ఉంచి చల్లగా ఉన్నప్పుడు తాగితే.. కలిగే రిలీఫ్ వేరు. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలోపాటు డీహైడ్రేషన్‌ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్ లు ఉంటాయి. ఇవి శరీరంలో పుట్టే వేడి కారణంగా నీరు కోల్పోవడాన్ని నివారిస్తుంది. అందుకే మజ్జిగ ది బెస్ట్.. అందులోనూ ఇది గొప్ప ప్రోబయోటిక్ ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది.
మారేడు జ్యుస్..
శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ మారేడు కాయలను జ్యుస్ చేస్తారని మీకు తెలుసా.. ఇది వేడిని అధిగమించడంలో అద్భుతంగా సహాయపడే ఉత్తమ పానీయాలలో ఒకటి. బేల్ అని పిలుచుకునే ఈ జ్యూస్ లో రిబోఫ్లావిన్ విటమిన్ బి నిండి ఉంటుంది. ఇది శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఈ సమ్మర్ లో శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
దోసకాయ పుదీనా జ్యూస్..
దోసకాయలలో సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, పుదీనా ఆకులు చల్లదనాన్ని రిఫ్రెష్ నెస్ ను అందిస్తాయి. ఈ రెండింటిని కలపడం వేసవికి అద్భుతమైన పానీయం రెడీ అయినట్టే.. దోసకాయ, పుదీన జ్యుస్ తయారుచేసి దానికి కాస్త నల్ల ఉప్పు, నిమ్మరసం జోడిస్తే.. అద్భుతంగా ఉంటుంది.
ఈ డ్రింక్స్ తో వేసవిని ఈజీగా అధిగమించవచ్చు.బాబోయ్ ఎండలు అని భయపడకుండా ఛిల్ల్ అవుతూ ఫుల్లు హ్యాపీ ఐపోండి..
◆నిశ్శబ్ద.