బంగ్లా క్రికెటర్‌ని పక్కనపెట్టమని బీసీసీఐ ఆదేశాలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హత్యలకు సంబంధించి పెద్ద కలకలమే రేగుతోంది. హిందువులపై వరుస దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మాస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ మినీవేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.2 కోట్లకు దక్కించుకోవడంపై  తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో బీసీసీఐ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని తాజాగా కేకేఆర్‌కు ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.

ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15న అబుదాబీలో జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ రికార్డు సృష్టించాడు. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండటంతో అతడిని ఐపీఎల్ నుంచి నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దాంతో అతన్ని రిలీజ్ చేయాలని బీసీసీఐ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ముస్తాఫిజుర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. 8.13 ఎకానమీతో సమర్థవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు, అనంతరం ముంబై ఇండియన్స్ , రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , చెన్నై సూపర్‌కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 60 మ్చాచ్‌లు ఆడి 65 వికెట్లు తీసుకున్నాడు.

గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో సీఎస్కే అతడిని విడుదల చేసింది.  మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆడే సిరీస్‌లపై ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలోనూ భారత్‌తో షెడ్యూల్ ప్రకటించింది. భారత్‌తో ఆగస్టు - సెప్టెంబరు మధ్య మూడు వన్డేలు, మూడు టీ 20 సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది. గత ఏడాది రెండు జట్ల మధ్య సిరీస్‌లు జరగాల్సి ఉండగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా నిరవధికంగా వాయిదా వేశారు. ఈ ఆగస్టు టూర్‌తో ఆ లోటు భర్తీ అవుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశాభావంతో ఉంది. అయితే ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ మాన్ ను పక్కన పెట్టేయాలన్న బీసీసీఐ   తాజా నిర్ణయంతో  టీమ్‌ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య క్రికెట్ సంబంధాల కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu