స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

 

 

బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ కోర్‌ కమిటీ సభ్యులు నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

సెప్టెంబరు 30వ తేదీ లోపు స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే 42శాతం బీసీలకు రిజర్వేషన్‌ అమలు ఎలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ.. ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ముగ్గురు మంత్రులకు ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యవహారాన్నీ అప్పగించినందున పార్టీ పరంగా బలోపేతమయ్యేందుకు ముమ్మరంగా కసరత్తు కొనసాగుతున్నట్లు సభ్యుల దృష్టికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీసుకొచ్చారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu