బాబు కోసం జాబ్ వదిలెయ్యండి : ఐటి ఉద్యోగులకు బండ్ల గణేష్ పిలుపు
posted on Sep 19, 2023 2:46PM
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ వ్యవహారం రోజురోజుకీ సంచలనంగా మారుతోంది. ఆయన అరెస్ట్ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని నినదిస్తూ రోడ్లపైకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతోంది. అన్ని రంగాలు, వర్గాల నుంచీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగురాష్ట్రాలలోనే కాకుండా, దేశ, విదేశాలలో చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంటులో కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయం ప్రస్తావనకు వచ్చింది. సినీ పరిశ్రమ నుంచి కూడా ఒక్కరొక్కరుగా చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో మొదలై, నిర్మాత కేఎస్ రామారావు ఇలా పరిశ్రమ ప్రముఖులు ఒక్కరొక్కుగా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబు జాతీయ సంపద, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు.
చంద్రబాబు పేరు చెప్పుకొని ఎంతో మంది బాగుపడ్డారనీ, ఆయన అక్రమ అరెస్ట్ తననెంతగానో బాధించిందనీ పేర్కొన్నారు. ఆ బాధతో తాను ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదన్నారు. ఐటి రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి మామూలుది కాదని పేర్కొంటూ, పార్కుల ముందు, రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు. ఐటి ఉద్యోగులు ఒక నెల రోజులు ఉద్యోగాలు మానేసి సొంత ఊళ్ళకు వెళ్ళి బొడ్రాయి ముందు కూర్చొని ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం ఘనవిజయం సాధిస్తుదనీ, . మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారనీ ధీమా వ్యక్తం చేశారు.