పెళ్లినాటి ముచ్చట్లు చెబుతున్న బాలయ్య
posted on Jan 15, 2013 9:48AM
"నా పెళ్లయిన కొత్తలో సంక్రాంతికి అత్తారింటికి వెళితే ఉదయాన్నే నిద్దరలేపి కొబ్బరినూనె తో నలుగుపెట్టి, నదీ జలాలతో స్నానం చేయించేవారు. కొత్త అల్లుడు వారికి దైవంతో సమానం. ఆడబిడ్డ వారికి మహాలక్ష్మి. అందుకే ఆడపిల్ల భర్తకు వారు విపరీతమయిన గౌరవం ఇచ్చేవారు” అని సంక్రాంతి సంధర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధరతో పెళ్లి తొలినాటి ముచ్చట్లు చెప్పుకొచ్చారు. మా తోడల్లుడు ప్రసాద్ తో కలిసి పండగకు అత్తారింటికి వెళ్లేవాళ్లం. వారి మర్యాదలకే కడుపునిండేది. ఇక వీధుల్లో పతంగులు, పిండివంటలతో సరదాగా సమయం గడిచిపోయేది అని అన్నారు. ఇక అదే సమయంలో ఆ చుట్టుపక్కల రాజమండ్రి, రామచంద్రాపురం, మండపేటలలోని బంధువుల ఇళ్లకు వెళ్లి వచ్చేవాళ్లం అని అన్నారు.
రామచంద్రాపురం సమీపంలోని చెల్లూరుకు చెందిన దేవరపల్లి సూర్యారావు, ప్రమీలలు బాలకృష్ణ అత్తామామలు. బాలకృష్ణ పెళ్లయ్యాక కొన్నేళ్ల తరువాత ఆయన మామ వ్యాపార నిమిత్తం కాకినాడకు వెళ్లిపోయారు. అలా తన తొలనాళ్లలో జరిగిన మర్యాదలను బాలయ్య చెప్పుకొచ్చారు. ఈ సంక్రాంతి బాలయ్య నారావారి పల్లెలో జరుపుకుంటున్నారు.