'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలయ్య సాయం.. నెటిజన్ల ప్రశంసల వర్షం!!
posted on Jan 6, 2020 2:16PM

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నాడు అంటూ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో టీడీపీ అధినేత చంద్రబాబుని, నందమూరి కుటుంబాన్ని కించపరిచేలా చూపించారంటూ.. అప్పట్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది కావాలని వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై వర్మ చేసిన సినిమా అని ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా ఎన్నికలకు ముందు ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి.
కాగా ఎన్నికలు ముగిసిన ఏడు నెలలు తరువాత.. ఈ సినిమా చర్చనీయాంశమైంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ పాత్రధారి విజయ కుమార్ భార్యకు క్యాన్సర్ సోకింది. ఆమెకు ఇప్పుడు.. బాలయ్య నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా పేరుతో తమ కుటుంబం, పార్టీ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూసిన వారికి కూడా బాలయ్య సాయం చేయడం నిజంగా అభినందనీయమని ప్రశంసిస్తున్నారు.
