బీఆర్ఎస్ కు చంద్రబాబు అరెస్టు సెగ!?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏపీ సర్కార్ అక్రమ అరెస్టు సెగ తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్ కు గట్టిగా తగులుతోంది. ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలతో సంఘీభావం ప్రకటిస్తున్నారు. పోలీసు ఆంక్షలను సైతం ధిక్కరించి కదం తొక్కుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్ల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించినా, ఐటీ ఉద్యోగులు వెనక్కు తగ్గలేదు. కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, అంబర్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పిలుపు మేరకు జరిగిన నిరసన ప్రదర్శనలలో జనం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలకు, ఆందోళనలకు అనుమతులు లేవని పోలీసులు ఆంక్షలు విధించినా జనం ఎక్కడా తగ్గడం లేదు. ఈ పరిస్థితి నిస్సందేహంగా అధికార బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన, నిరసన తెలుపుతుంటే.. అది కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా కాదు.. ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సంఘీభావంగా స్వచ్ఛందంగా శాంతియుతంగా నిరసనలకు దిగితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధించాలన్న ప్రశ్నకు ప్రభుత్వ వర్గాల నుంచి కానీ, అధికార పార్టీ శ్రేణుల నుంచి కానీ సమాధానం రావడం లేదు.  ఏపీలో జగన్ సర్కార్ కు, బీఆర్ఎస్ కు రహస్య మైత్రి ఉందన్న భావన రోజురోజుకూ బలపడేలా చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను బీఆర్ఎస్ సర్కార్ అణచివేత చర్యలు ఉంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు.. తెలంగాణలో తెలుగుదేశం నెత్తిన పాలు పోసిన చందంగా ఉందని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడలేదనీ, నాయకత్వ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ క్రియాశీలంగా లేదని ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర నియోజకవర్గాలలో ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్స్ సంఖ్య చాలా అధికం. ఆ సెటిలర్ల మద్దతుతోనే బీఆర్ఎస్ ఇంత కాలం గెలుస్తూ వస్తున్నది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మలక్‌పేట, రాజేందర్‌నగర్ వంటి నియోజకవర్గాల్లో సెటిలర్ల  ఓట్లే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. అలాగే  ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో కూడా  సెటిలర్ల ప్రభావం గణణీయంగానే ఉంటుంది. మొత్తంగా పాతిక నుంచి ముఫ్ఫై నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో తెలుగుదేశం చాలా బలంగా ఉందన్నది పరిశీలకుల అంచనా.  ఇంత కాలం రాష్ట్రంలో సెటిలర్ల మద్దతుతోనే బీఆర్ఎస్ గత రెండు ఎన్నికలలో విజయం సాధించగలిగిందన్న సంగతిని బీఆర్ఎస్ కూడా అంగీకరిస్తుంది. అందుకే సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ పలు సందర్బాలలో చెప్పారు. 

అయితే చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా  అరెస్టు చేయడంతో తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనలను కేసీఆర్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేయాలని చూడటంపై సెటిలర్స్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఆగ్రహం వచ్చే ఎన్నికలలో  అధికార పార్టీపై తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనలను పోలీసులను ప్రయోగించి అణచివేస్తుంటే కూకట్‌పల్లి  ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారావు  బాబు అరెస్టును ఖండించారు. అలాగే  ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా  బాబు అరెస్టును ఖండిస్తూ వనస్థలిపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, బాబుకు సంఘీభావం ప్రకటించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ అధినేత బాబు అరెస్టుపై ఒక్క ముక్క మాట్లాడకపోవడం.. మరో వైపు ఆందోళనలకు అనుమతులు ఇవ్వకుండా.. పోలీసులను ఉపయోగించడం ద్వార అణచివేస్తున్న క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు బాబుకు సంఘీభావం ప్రకటించే అవకాశాలు లేవు. కానీ కూకట్ పల్లి, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు బాబుకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారికి అలా పొల్గొనడం అనివార్యమైంది. బాబుకు మద్దతుగా నిలబడకపోతే వారి వారి నియోజకవర్గాలలో విజయంపై వారు ఆశలు వదిలేసుకోవలసిన పరిస్థితి ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.

వాళ్లు వ్యక్తిగత స్థాయిలో బాబుకు మద్దతు పలికినా, బీఆర్ఎస్ ప్రభుత్వం బాబు అరెస్టుపై స్పందించని తీరు మాత్రం బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలలో తీరని నష్టం చేసే అవకాశాలే ప్రస్ఫుటంగా ఉన్నాయన్నది పరిశీలకులు విశ్లేషణ.  ఇక బీజేపీ బహిష్కృత నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బాబు అరెస్టును ఖండించారు. అక్కడితో ఆగకుండా ఏపీలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని కూడా అన్నారు. దీనిపై కూడా పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. రాజాసింగ్ ను బీజేపీ దూరం పెట్టేసిందన్నది సుస్పష్టం. మినీ భారత దేశం అని చెప్పడానికి వీలైన గోషా మహల్ నియోజకవర్గంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం ద్వారా రాజీ సింగ్ కు మంచి మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గోషామహల్ నుంచి పోటీలో దిగడం కంటే ఆయన సైకిలెక్కి తన సొంత నియోజకవర్గంలో నిలబడాలన్న ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చని అంటున్నారు.  మొత్తం మీద ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టు సెగ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు గట్టిగానే తగులుతోందని చెప్పవచ్చు.