ఎంతైనా అవినాష్ రెడ్డి అదృష్టవంతుడు
posted on May 25, 2023 9:59AM
ఏదీ ఏమైనా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అదృష్టవంతుడే అంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతోంది. అవినాష్ రెడ్డి జైల్లో ఉంటే తన తండ్రి భాస్కరరెడ్డితో ఉంటాడని... అదే జైలు బయట ఉంటే తన తల్లి శ్రీలక్ష్మీతో ఉంటాడని.. అయినా ఎక్కడ ఉన్నామా? అన్నది ముఖ్యం కాదని.. తల్లిదండ్రులతో ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యమంటూ నెటిజన్లు.. పోకిరి సినిమాలో బాగా బాపులర్ అయిన డైలాగ్.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? తరహాలో కామెంట్ చేస్తున్నారు.
అవినాష్ అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కర్నూలులోని విశ్వభారతీ ఆసుపత్రి చుట్టూ కాలు కాలిన పిల్లిలా చక్కర్లు కొడుతూ, కర్నూలు జిల్లా ఎస్పీతో భేటీ అయి.. అవినాష్ రెడ్డి లొంగిపోవాలని చెప్పాలంటూ ఆ దర్యాప్తు సంస్థ అధికారులు బాబ్బాబు అంటూ బతిమాలడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అదృష్టవంతుడు అని పక్కాగా కన్‌ఫర్మ్ అవుతోందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు సీబీఐ దూకుడుకు కళ్లెం వెయ్యగల మోనగాళ్లు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారంటే.. అది కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ శ్రేణులే అన్నది సుస్పష్టమని తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోందని వారు అంటున్నారు.
ఇక జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తి దాడి జరిగితే.. తనకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదంటూ... పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్‌కు ఆగమేఘాల మీద వచ్చేశారని.. అలాంటి వ్యక్తి నేడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా.. సదరు పోలీసులు ఆయన నమ్మకం కోసం శాయ శక్తులా శక్తివంచన లేకుండా కష్టపడి పని చేసుకొంటూ.. ఫ్యాన్ పార్టీ రెక్కలే కాదు.. వైసీపీకి కళ్లు, చెవులు అన్నీ అయిన.. జగన్ పార్టీ శ్రేణులపై ఈగ కూడా వాలనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలాంటిది ఆంధ్రుల తొలి రాజధాని.. నేడో రేపో న్యాయ రాజధానిగా రూపుదిద్దుకొనున్న కర్నూలు నగరంలో.. అదీ విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లిని జాగ్రత్తగా కాపాడుతోన్న అవినాష్ రెడ్డిపై సీబీఐ నీడ కాదు కదా.. ఈగ సైతం వాలకుండా పార్టీ కేడర్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే.. ఆ క్యాడర్ కు పోలీసులు రక్షణ కవచంగా నిలిచారని సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ గతంలో అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించిందని.. ఇదే కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా.. అవినాష్ రెడ్డి మాత్రం.. ముందస్తు ప్రణాళికలతో సీబీఐకి చిక్కకుండా తిరుగుతున్నారని అంటున్నారు.
అయినా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును జీతాలుగా తీసుకునే ఈ పోలీసులు.. ఇలా విశ్వభారతీ ఆసుపత్రికీ, అందులో ఉన్న అధికార పార్టీ ఎంపీ ప్లస్ ముఖ్యమంత్రి కజిన్ అవినాష్ రెడ్డికి, ఆయన తల్లితోపాటు ఆసుపత్రి వద్ద ఉన్న పార్టీ కేడర్‌కు రక్షణగా ఇలా చెమటోడ్చి.. కష్ట పడడం చూస్తుంటే.. అనినాష్ రెడ్డి నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు.