ఎవరీ హరీష్ కుమార్ గుప్తా.. ఈసీ ఆయన్నేఏపీ డీజీపీగా ఎందుకు నియ‌మించింది?

ఆంధ్రప్రదేశ్ నూత‌న‌ డీజీపీగా హ‌రీశ్ కుమార్ గ‌ప్తాను ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ఆయన సోమవారం (మే6) బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీగా కొన‌సాగుతున్న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై ఎన్నిక‌ల సంఘం ఆదివారం బ‌దిలీ వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విప‌క్షాల నుంచి ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపిన ఈసీ.. రాజేంద్ర‌నాథ్ రెడ్డి డీజీపీగా కొన‌సాగితే ఏపీలో ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌వ‌ని భావించి ఆయ‌న‌పై బ‌దిలీ వేటు వేసింది. కొత్త డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాను నియ‌మించింది. ఆయ‌న సోమ‌వారం (మే6)సాయంత్రం ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే అసలు హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల్లో సీనియారిటీ లిస్ట్ లో హ‌రీశ్ ఆరో స్థానంలో ఉన్నారు. తొలి ఐదుగురిని కాద‌ని ఈసీ హ‌రీశ్ కుమార్ గుప్తానే ఎందుకు నూత‌న డీజీపీగా ఎంపిక చేసింది అనే చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో హ‌రీశ్ కుమార్ గుప్తా అయితేనే ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించ‌గ‌ల‌ర‌ని ప‌లు అంశాల‌ను బేరీజు వేసుకొని ఈసీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హ‌రీశ్ కు ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 

ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన హ‌రీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయ‌న జ‌మ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల లిస్టులో మొద‌టి స్థానంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నారు. కానీ, ఆయ‌న స‌స్పెన్షన్ పై క్యాట్ విచార‌ణ‌ జరుగుతోంది. దీంతో ఆయ‌న పోస్టింగ్ కు అవ‌కాశం లేకుండా పోయింది. రెండో స్థానంలో ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఉన్నారు. తొలుత ఆయ‌న్నే నూత‌న డీజీపీగా ఈసీ ఎంపిక చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ హ‌రీశ్ కుమార్ గుప్తాను ఏపీ నూత‌న డీజీపీగా ఈసీ నియ‌మించింది. హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయ‌న గ‌తంలో ఎక్క‌డెక్క‌డ ప‌నిచేశారు.. ? ఏపీలో ఏఏ విభాగాల్లో ఆయ‌న ప‌నిచేశార‌నే విష‌యాల‌ను చూస్తే.. 

1992లో ఐపీఎస్ అధికారిగా ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 
1994లో ఖ‌మ్మం జిల్లా అడిష‌న‌ల్ ఎస్పీగా ప‌నిచేశారు.
 1995లో మెద‌క్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు.
 1996లో క‌రీంన‌గ‌ర్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు.
1999లో   తొలిసారి ఆయ‌న‌కు ప‌దోన్న‌తి ల‌భించింది. కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న 2002 సంవ‌త్స‌రం వ‌ర‌కు అక్క‌డే  ప‌నిచేశారు.
 2002 సంవ‌త్స‌రంలో యూస‌ఫ్ గూడ‌లోని ఫ‌స్ట్ బెటాలియ‌న్ సూప‌ర్ క‌మాండెంట్ గా వెళ్లారు. 
ఆరు నెల‌ల త‌రువాత 2002లోనే సీఐడీ ఎస్పీగా ప‌నిచేశారు. 
2004లో హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ప‌నిచేశారు. 
2006 నుంచి 2011 సంవ‌త్స‌రం వ‌ర‌కు న‌ల్గొండ జిల్లా ఎస్పీగా ప‌నిచేశారు. 
2011 నుంచి 2012 వ‌ర‌కు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఐజీగా ప‌నిచేశారు.
 2012 నుంచి 2016 వ‌ర‌కు గుంటూరు రేంజ్ ఐజీగా ప‌నిచేశారు. 
2016లో టెక్నిక‌ల్ స‌ర్వీస్ ఐజీ కొన్నాళ్లు.. లా అండ్ ఆర్డ‌ర్ ఐజీగా కొన్నాళ్లు ప‌నిచేశారు. 
2019లో  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లా అండ్ ఆర్డ‌ర్ అడిష‌న‌ల్ డీజీగా ప‌నిచేశారు. 
2022లో ఎస్ఎల్‌పీఆర్‌బి  చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న కొద్ది నెల‌ల‌కే రైల్వేలో అడిష‌న‌ల్ డీజీపీగా ప‌నిచేశారు. 
2023 మే నెల‌లో హోంశాఖ కార్యదర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

 2024 మే 6న ఏపీ నూత‌న డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న వెంట‌నే డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.