జేబుల్లో తీసుకెళ్లేలా టీన్లలో బీరు.. తాగండి-ఊగండిలా ఏపీ మద్య విధానం!

మాట తప్పం.. మడమ తిప్పం.. ఇది వైసీపీ నినాదం. జగన్మోహన్ రెడ్డి నినాదం.. ఇది చెబుతూనే 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు జగన్ సహా వైసీపీ నేతలు. అధికారంలోకి వచ్చాకా మాత్రం ఆ సంగతే మరిచిపోయారు. మాట తప్పడం.. మడమ తిప్పడమే జగన్మోహన్ రెడ్డి సిద్దాంతంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలన్నింటికి ఒక్కొక్కటిగా తూట్లు పొడుతుస్తున్నారు వైసీపీ అధినేత. మద్యపాన నిషేదం విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

రాష్ట్రంలోని పేద కుటుంబాల‌కు శాపంగా మారిన మ‌ద్యం అమ్మ‌కాల‌ను మేం అధికారంలోకి రాగానే విడ‌త‌ల వారీగా నియంత్రిస్తామని గతంలో జగన్ చెప్పారు. మ‌ద్యం ధ‌ర‌లు ముట్టుకుంటే.. షాక్ కొట్టే క‌రెంటు మాదిరిగా పెంచేస్తామన్నారు.  దీంతో సామాన్యుడు మ‌ద్యం జోలికిపోవాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి తీసుకువ‌స్తామని ఎన్నిక‌ల‌కు ముందు ఊదరగొట్టారు జగన్ రెడ్డి. ఇప్పుడు మాత్రం ఆయ‌న వ్య‌వ‌హారం.. `ఇంకా తాగండి.. ఇంకా ఇంకా తాగండి`-అన్న‌ట్టుగానే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

నిజానికి మ‌ద్యం అమ్మ‌కాల‌ను త‌గ్గిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాది మ‌ద్యం దుకాణాల‌ను ప్ర‌భుత్వ ప‌రం చేసి.. కొన్ని దుకాణాలు త‌గ్గించారు. అయితే.. సంక్షేమ పేరిట ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతుండ‌డంతో ఆదాయం లేక ఖ‌జానా ఖాళీ అయింది. దీంతో మ‌ద్య‌మే ప్ర‌భుత్వాని ప్ర‌ధాన ఆదాయంగా మారిపోయింది. దీంతో వివిధ రూపాల్లో  మ‌ద్యం షాపుల‌కు అనుమ‌తులు ఇస్తున్నారు. ఇప్ప‌టికే.. ప‌ర్యాట‌కం పేరిట మాల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో.. కూడా మాల్స్ పేరిట ఏసీ.. దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవి చాల‌వ‌న్న‌ట్టుగా.. ఇకపై క్యాన్‌ బీర్లు, 90 ఎంఎల్‌ బుడ్డీలలో మద్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

జగన్ రెడ్డి సర్కార్ కొత్త విధానం ప్రకారం ఇకపై బీర్లు టిన్లలోనూ అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో బీరును సీసాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. 650 ఎంఎల్‌, 350 ఎంఎల్‌ సీసాల్లో బీరు దొరుకుతోంది. తాజా నిర్ణయంతో జేబులో పట్టే టిన్లలో బీర్లు రానున్నాయి.  330 ఎంఎల్‌, 500 ఎంఎల్‌… ఇలా రెండు రకాల క్యాన్లలో బీరును అందుబాటులోకి తెస్తున్నారు. సీసాల్లో ఉన్న బీరును కొని బయట తాగడమే కష్టం. బరువుగా, పొడవాటి సీసాలను తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది. టిన్‌ బీర్లు అలా కాదు. చేతిలో ఇమిడిపోతాయి. స్టైల్‌గా ఉంటాయి. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లి, అంతే సులువుగా తాగేయవచ్చు. దీంతో ప్రయాణాల్లోనూ వీటితో బీర్లు లాగించవచ్చు. మద్యం అమ్మకాలు పెంచుకోవాడనికే ఇలా అమలు చేస్తున్నారనే అభిప్రాయం జనాల నుంచి వస్తోంది. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్ బీర్తో పాటు 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ అనుమతిచ్చింది. 

అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీశాఖ పేర్కొంది. ప్రస్తుతం ఒక క్వార్టర్‌… అంటే 180 ఎంఎల్‌ సీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 90ఎంఎల్‌ సీసాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఒక క్వార్టర్‌ సీసా కొనాలంటే వినియోగదారుడు కనీసం రూ.200 పెట్టాల్సి వస్తోంది. దీంతో తక్కువ రేట్లకు వస్తున్నాయని పక్క రాష్ట్రం మద్యం, నాటుసారాకు మొగ్గుచూపుతున్నారని… అందుకే, సుమారు రూ.వందకే దొరికేలా ఇక్కడే 90ఎంఎల్‌ సీసాలు తెస్తే అక్రమ మద్యం తగ్గిపోతుందని అధికారులు వాదిస్తున్నారు. ఇదంతా కూడా త‌మ వాగ్దానం మేర‌కు మద్యం వినియోగం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అసలు సంగతి మాత్రం ప‌రోక్షంగా మ‌ద్యం వినియోగాన్ని, అమ్మ‌కాలను పెంచుకోవడమే జగన్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu