ఉద్యోగ సంఘ నేతలూ.. నెత్తురు ఉడకటం లేదా?
posted on Nov 8, 2020 11:33AM
జీతాలు,పెన్షన్లు ఆపినా గొంతు పెగలదేం
నేతలపై ఉద్యోగుల ఉగ్రరూపం
జగనన్న సర్కారుకు శ్రమదానం చేస్తున్న ఉద్యోగ సంఘాల పాతివ్రత్యానికి, ఇప్పుడు పెద్ద పరీక్ష వచ్చి పడింది. ఒక్క డీఏను విడతల పద్ధతిలో ఇచ్చినందుకే, జగనన్న సర్కారుకు శతకోటిదండాలు పెట్టి, అపార భక్తిప్రపత్తులు చాటిన ఉద్యోగ సంఘాల నేతలు.. 40 శాతం మందికి ఇంకా వేతనాలు, పెన్షన్లు ఇవ్వని సర్కారు వైఫల్యంపై ఏమంటారు? 60 శాతం మంది పొందిన ప్రయోజనాలను, మిగిలిన 40 శాతం మందికి ఇప్పించడంలో నేతలు ఎందుకు విఫలమయ్యారు? ఈన్యాయంపై గొంతెత్తేందుకు, చొక్కా-లాగూలు తడిసిపోతున్నాయా? గత పాలకుల ముందు రెచ్చిపోయిన మీ పౌరుషం, ఏ కృష్ణానదిలో కలిసింది?.. ఇవీ.. ఇప్పటివరకూ పెన్షన్లు, జీతాలు అందని 40 శాతం మంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘ ‘పెద్దారెడ్ల’పై ప్రదర్శిస్తున్న ఉగ్రరూపం.
ఏపీలో ఆర్ధికపరిస్థితి అధ్వానస్థితికి చేరింది. 40 శాతం మందికి ఇంకా పెన్షన్లు, వేతనాలు, డీఏ చెల్లింపులు అందకపోవడమే, దానికి నిలువెత్తు నిదర్శనం. పథకాలతో ప్రజలకు డబ్బులు పప్పుబెల్లాల్లా పంచేస్తున్న జగనన్న సర్కారుకు.. తమకు జీతాలు, పెన్షన్లు, డిఏ బకాయిలు ఇచ్చేందుకు మాత్రం, చేతులు రాకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. దీనికంతటికీ తమ నాయకుల, పరాథీన త-లొంగుబాటే కారణమని ఉద్యోగులు చెబుతున్నారు.
తమ ‘పెద్దారెడ్లు’ పూర్తి సమయాన్ని.. సర్కారు సేవలో తరించేందుకే వెచ్చిస్తున్నందున, తమ గురించి ఆలోచించే సమయం లేకుండా పోయిందని, వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, గత 17 నెలల క్రితం వరకూ.. ఉద్యోగ సంఘాల నేతలంటే, పాలకులకు భయం ఉండే భయం, ఇప్పుడు లేదంటున్నారు. దానికి కారణం.. తమ నేతల అసమర్థత- వైఫల్యం-‘సామాజిక’సంకటమేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి వారికే చెమటలు పట్టించి, సెక్రటేరియట్ వద్ద పడుకునేలా చేసిన ఘనత, నాటి ఉద్యోగులదని గుర్తు చేస్తున్నారు.
గతంలో ఏ సీఎం అయినా.. ఉద్యోగ సంఘ నేతలకు ఎప్పుడంటే అప్పుడు, అపాయింట్‌మెంట్ ఇచ్చిన గత పూర్వవైభవాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఇప్పుడు నేతలే సీఎంను కలిసేందుకు వణికిపోతున్నారు. సీఎం కూడా వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా, కిందివారితో మాట్లాడిస్తున్నారని చెబుతున్నారు. తమ డిఏలు ఆగినా, జీతాలు-పెన్షన్లు నిలిపివేసి, కోతలు విధించినా.. ఇదేం అన్యాయమని ప్రశ్నించే దమ్ము, ఒక్క నాయకుడికీ లేకుండా పోవడం తమ దౌర్భాగ్యమంటున్నారు.
ఎమ్మెల్యేలు-ఎంపీలంటే.. మళ్లీ టికెట్లు వస్తాయో, రావోనన్న భయంతో పాలకపార్టీని ప్రశ్నించకుండా మౌనంగా ఉంటారు. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, ప్రశ్నించే ధైర్యం చేయరు. కానీ ఉద్యోగులకు ఆ భయం అవసరం లేదు. పార్టీలు-ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, 30 ఏళ్లు సర్వీసులో ఉంటారు. మరి అలాంటి ఉద్యోగులు-వారికి నాయకత్వం వహిస్తున్న నేతలూ, పాలకులకు ఎందుకు భయపడుతున్నారన్నది ప్రశ్న.
సచివాలయ ఉద్యోగుల పరిస్థితి, మరీ దారుణంగా ఉందంటున్నారు. ఉద్యోగ సంఘ నేతలు తమ మెహర్బానీ కోసం, తమ ప్రయోజనాలను పాలకుల వద్ద.. పణంగా పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పెద్దారెడ్లు’... మీ ఉద్యోగుల మనోవేదన మీకు అర్ధమవుతోందా?
-మార్తి సుబ్రహ్మణ్యం