ప్రస్తుత ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచన
posted on Nov 27, 2015 10:01AM
ఆంధ్రప్రదేశ్ లో తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతవరకు ఇసుక క్వారీలను వేలం వేసే పద్దతికి స్వస్తి చెప్పి స్థానిక మహిళా, రైతు సాధికార సంఘాల ద్వారా ఇసుక తవ్వకాలు జరిపించి ప్రజలకు అందించడం మొదలుపెట్టింది. తద్వారా ఇసుక దళారులను అరికట్టడం, తక్కువ ధరకే వినియోగదారులకు నాణ్యమయిన ఇసుక అందించడం, ఇసుక తవ్వకాల ద్వారా మహిళా, రైతు సాధికార సంఘాలకు ఆదాయ వనరును ఏర్పాటు చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావించింది. ఇసుక అవసరమయిన ప్రజలు దాని కోసం దళారులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండయినా ఆన్ లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకొనే సదుపాయం కల్పించబడింది.
ప్రభుత్వం ఉద్దేశ్యం చాలా మంచిదే అయినప్పటికీ, ఈ ప్రయోగంలో కొన్ని లోటు పాట్లు ఎదురవడంతో అది ఆశించిన ఫలితాలు సాధించకపోగా, రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది. తత్ఫలితంగా ఇసుక ధరలు చాలా బారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ఏ దళారీ వ్యవస్థను తొలగిద్దామనుకొందో, అదే వ్యవస్థ ఇంకా బలపడి సామాన్య ప్రజలకు, రియల్ ఎస్టేట్ రంగానికి చుక్కలు చూపిస్తోంది. ఇదంతా గమనించిన ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ ఇసుక తవ్వకాలు, సరఫరా, అమ్మకాలు, ప్రస్తుత అమలు చేస్తున్న విధానంలో తపొప్పులను సర్వే చేయించి నివేదిక తెప్పించుకొంది. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రస్తుత ఇసుక సరఫరా విధానంలో చాలా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక సరఫరా విధానంపై నిన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసారు. అందులో నిజాయితీగా ఈ లోపాలను కూడా పేర్కొని వాటన్నిటినీ సవరించి 2016, జనవరి 1వ తేదీ నుండి సరికొత్త ఇసుక సరఫరా విధానాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చేరు.
ప్రస్తుత ఇసుక విధానం ద్వారా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 517.36 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా, రైతు సాధికార సంఘాలకు ఆ ఆదాయంలో నుండి చెరో 25 శాతం కేటాయిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తెలిపారు. జనవరి 1 నుండి అమలు చేసే కొత్త విధానంలో కూడా మహిళా, రైతు సాధికార సంఘాలకు అదే నిష్పత్తిలో ఆదాయంలో వాటా పంచి ఇస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అమలుచేస్తున్న విధానంలో కొన్ని లోపాలు కనుగొన్నందున, తెలంగాణా, కర్నాటక, ఓడిశా రాష్ట్రాలలో అమలులో ఉన్న వేర్వేరు ఇసుక విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిలో అన్నిటికంటే అత్యుత్తమయిన విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేరు. ఈ ఇసుక విధానంపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వారి సూచనలు, సలాహాలను కూడా పరిగణనలోకి తీసుకొంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా, రైతు సాధికార సంఘాలకు దీని ద్వారా ఉపాధి కల్పిస్తూనే, ప్రజలకు వీలయినంత తక్కువ ధరలో నాణ్యమయిన ఇసుకను సకాలంలో అందించాలనేదే తమ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ప్రజలకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ఇటువంటి నూతన ఆలోచనలు చేయడం ఎంత అవసరమో, దానిలో తప్పొపులను సమీక్షించుకొని సవరించుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఏ ఆలోచన అయినా ఫలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఇసుక విధానంపై సరయిన దిశలోనే పయనిస్తోందని అర్ధమవుతోంది.