విశాఖలో పులివెందుల పంచాయతీలు... జగన్, విజయసాయిపై తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డా? లేఖ విజయసాయిరెడ్డా? అంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే.... విజయసాయిరెడ్డి.... వైజాగే రాజధాని అంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. భీమిలి ప్రాంతంలో రాజధాని రాబోతుందని విజయసాయి ఏవిధంగా ప్రకటించారని నిలదీశారు. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక ముందే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలకాలంటూ విజయసాయి ఎలా పిలుపునిస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు.

అయినా, దొంగ లెక్కలు రాసి జైలుపాలైన విజయసాయిరెడ్డి రాజధానిపై ప్రకటన చేయడమేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారన్న దేవినేని ఉమా... విశాఖలో పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో విజయసాయి ఆగడాలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ ‌రెడ్డి తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో అధికారులు భాగస్వాములు కావొద్దని సూచించిన దేవినేని ఉమ... టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైనా సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు.

దేవినేని ఉమా తరహాలోనే సీపీఐ రామకృష్ణ కూడా సీఎం జగన్‌‌ను నిలదీశారు. కేబినెట్ భేటీకి ముందే... విశాఖే రాజధాని అంటూ విజయసాయిరెడ్డి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. విజయసాయి ప్రకటనపై జగన్మోహన్‌రెడ్డి వివరణ ఇవ్వాలన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ప్రాంతాల మధ్య జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టారని విమర్శించారు. అయినా, ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్ రాకముందే అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని రామకృష్ణ ప్రశ్నించారు. మళ్లీ ఎవరిని మభ్యపెట్టడానకి హైపవర్ కమిటీ వేశారని ప్రశ్నించిన సీపీఐ రామకృష్ణ.... జగన్, విజయసాయిరెడ్డి కలిసి నిర్ణయాలు తీసుకుంటే... ఇంకా కమిటీలు ఎందుకన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిజంగానే జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.... అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.