అద్భుతమైన రాజధానిని నిర్మిస్తా

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెంగ్డూ రౌండ్ టేబుల్ సమావేశంలో పారిశ్రామిక వేత్తలతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చైనా సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిని నిర్మించే అవకాశం తమకు దొరికిందని, అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పారు. ఇప్పటికే సింగపూర్ వాళ్లు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారని, మరో రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ ఇస్తారని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అందుకోసం పథక రచన చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయని, పరిశ్రమలు, హార్డ్‌వేర్‌, సేవారంగాలకు అక్కడ పుష్కల అవకాశాలున్నాయని ఆయన అన్నారు.