చిక్కుల్లో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్?
posted on Jul 26, 2021 6:08PM
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు ఉచ్చు బిగిస్తోందా?కేంద్ర హోంశాఖ ఆయనపై వేటు వేయనుందా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఢిల్లీలో పెట్టిన కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉంటున్నాయి. సునీల్ కుమార్ విషయంలో కేంద్ర హోంశాఖ సీరియస్ గానే స్పందించే అవకాశం ఉందని సమాచారం.
హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో ఎంపీ రఘురామ రాజు గతంలో ఫిర్యాదు చేశారు. సునీల్‌కుమార్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తన ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. ఏపీ సీబీసీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు కూడా రఘురామ లేఖ రాశారు.
అయితే సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ రఘురామ రాసిన లేఖను కేంద్ర డీఓపీటీ శాఖజితేంద్రసింగ్ హోంశాఖకు పంపారు. హోంశాఖ కార్యదర్శికి పంపిన లేఖ కాపీని రఘురామకు కూడా జితేంద్రసింగ్ పంపారు. సునీల్‌పై హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సునీల్ కుమార్ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం సేకరించిందని తెలుస్తోంది. మతాలకు సంబంధించి ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు యూట్యూబ్ లో ఉన్నాయి. వాటన్నింటిని కేంద్రం పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ కు ఉచ్చి బిగిస్తోందని ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.