ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబందించిన అనేక సమస్యలను లోతుగా చర్చించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆరోజున రాష్ట్రావతరణ దినోత్సవంగా కాక నవనిర్మాణ దీక్షా దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 2నుండి 8వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి చివరి రోజయిన జూన్ 8న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళా సంఘాలకు జూన్3-8 తేదీల మధ్య రూ. 4284 కోట్లు ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించారు. కాయగూరలు పండించే రైతులకు విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇస్తారు.

 

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విమానాశ్రయం, విమాన శిక్షణ సంస్థ, విమానాల నిర్వహణ, మరమత్తుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కోసం భూసేకరణ. తిరుపతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం జూన్ నెలలో ప్రారంభం. రాజమండ్రికి రాత్రిపూట కూడా విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రానికి లేఖ వ్రాయాలని నిర్ణయించారు. గుంటూరులో వినుకొండ, నెల్లూరులో దగదర్తి, కర్నూలులో ఓర్వకల్లు, చిత్తూరులో కుప్పం, పశ్చిమగోదావరిలో తాడేపల్లి గూడెం వద్ద కొత్తగా విమానాశ్రయాల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

 

మే10 నుండి 31 రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల బదిలీలు పూర్తి చేయడం. తితిదే పాలకమండలిలో ఎక్స్ అఫీషియో గా కొనసాగుతున్న తుడా చైర్మన్ తొలగించాలని నిర్ణయం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన నీరు-చెట్టు, చెరువులలో పూడికతీత పనులను వేగవంతం చేయాలని నిర్ణయం. డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో వ్యవసాయం కోసం రూ.534కోట్లు కేటాయింపు. ప్రతీ మంత్రిత్వ శాఖలో ఆర్ధిక శాఖ తరపున ఒక అధికారి, మీడియా లైజనింగ్ ఆఫేసర్ ఏర్పాటు.