బీజేపీ నుంచి శివాజీ సస్పెన్షన్?

 

భారతీయ జనతా పార్టీ నుంచి సినీ నటుడు శివాజీని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. గత ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరిన శివాజీ, ఆ పార్టీ విజయం కోసం తనవంతు కృషి చేశారు. ఏపీలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి బీజేపీకి ప్రచారం కూడా చేశారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తాత్సారం చేయడం వల్ల ఆయన కినుక వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఉద్యమించారు. దాంతో ఏపీ బీజేపీలోనే ఆయనకు వ్యతిరేకులు పెరిగారు. ఒక బీజేపీ నాయకుడైతే శివాజీ బీజేపీలోనే లేరని ఆమధ్య ప్రకటించారు. శివాజీ మాత్రం తాను బీజేపీలో వున్నానని చెబుతూ వచ్చారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఒక సమావేశంలో కొంతమంది ఏపీ బీజేపీ కార్యకర్తలు శివాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శివాజీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకత్వం భావించినట్టు, ఈ మేరకు శివాజీకి నోటీసు కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది.