అంగన్ వాడీలకు తీపికబురు.. జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
posted on May 6, 2025 3:15PM

అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి వేతలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ టీచర్లను అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోట్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు ఇకపై అంగన్‌వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్‌వాడీ అనే తేడా ఉండదు. కాగా, గతంలో మినీ అంగన్‌వాడీలకు రూ.7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ.13,650 జీతం అందనుంది.
పెంచిన వేతనం ఏప్రిల్ నెల నుంచి అకౌంట్లలో జమ కానుంది. అయితే, శాలరీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 అంగన్‌వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు జీతం పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్నికి వారు కృతజ్ఙతలు తెలిపారు.