స్టార్టప్ హబ్ గా ఆంధ్రప్రదేశ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్, ఆర్టీజీఎస్ విభాగాలపై బుధవారం (ఆగస్టు 14) సచివాలయంలో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు.  

ఐటి కంపెనీలు ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఆసక్తి కనపరుస్తున్నాయనీ, వాటిని  రాష్ట్రానికి తీసుకువచ్చేలా ప్రయ్నతాలు చేయాలన్నారు.   విశాఖపట్నం ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఇతర విద్యా సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న స్టార్టప్ లను గుర్తించి వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ, టెస్టింగ్ పార్కు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. 

పౌర సేవల కోసం యాప్   రూపకల్పన చేయాలన్నారు.    పలు రకాల పౌర సేవలను అందించే విషయంలో   లాజికల్ కన్క్లూజన్ కు రావాలన్న ధ్యేయంతో ముందుకు సాగాలని సూచించారు.  రాష్ట్రంలో సైబర్ సెక్యురిటీకి సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.   రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు  రాష్ట్ర మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ అండ్ ఆర్టీజిఎస్ శాఖ మంత్రి నారా లోకేశ్  చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ విధానంలో ప్రజల సమస్యలను స్ట్రీమ్ లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐటి-ఎలక్ట్రానిక్స్ రంగంలో మెరుగైన అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు.