ఆక్వా రైతులకు చంద్రబాబు అండ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు కుదేలైన ఆక్వా రంగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసాగా నిలిచారు. ట్రంప్ సుంకాల విధింపు  ప్రభావం ఏపీలో మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని అక్వా రైతులపై తీవ్రంగా పడింది. ట్రంప్ సుంకాల కారణంగా  ఏపీ నుంచి విదేశాలకు రొయ్యల ఎగురమతులు భారీగా పడిపోయాయి. ఫలితంగా   ఆక్వా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.  అదే సమయంలో ట్రంప్ సుంకాల దెబ్బతో బెంబేలెత్తిపోయిన రొయ్యల ఎగుమతిదారులు,  రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తున్నా అతి తక్కువ ధరలు మాత్రమే ఇస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిపై సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి చచంద్రబాబు నష్టనివారణ చర్యలకు నడుంబిగించారు.

కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ కు లేఖ రాశారు. అంతే కాకుండా సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ఆయా శాఖల అదికారులతో నిర్వహించిన ఈ కీలక సమావేశంలో  చంద్రబాబు   దీర్ఘకాలంలో స్థానిక వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని, ఫలితంగా విదేశీ మార్కెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో ఆక్వా రైతులను ఆదుకునే దిశగా వ్యాపారులు, ఎగుమతి దారులు సహకరించాలని కోరారు. అందుకోసం 100 కౌంట్ రోయ్యలను కిలోకు రూ.220కి తగ్గకుండా కొనుగోలు చేయాలని   సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారుల నుంచి సానుకూల స్పందన లభించింది.  

అలాగే దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ లకు రొయ్యల ఎగుమతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, మంచి ఫలితాలు కూడా ఉంటాయని అన్నారు.  తాను కూడా కేంద్రంతో చర్చించి, ఆయా దేశాలలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదిరే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.  ఇక ఆక్వా రంగంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆక్వా రైతులు ఆక్వా రంగ నిపుణులు, ఎగుమతిదారులు, ఎంపెడా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుందని ఆయన తెలిపారు.