ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై అంత కక్ష ఎందుకో?
posted on Jun 27, 2015 7:42AM
ఓటుకి నోటు వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజాప్రతినిధులను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వార్త చూస్తే అర్ధమవుతుంది.
ఓటుకి నోటు కేసులో దొరికిన రూ.50 లక్షలు నగదు తెదేపా ప్రధాన కార్యాలయమయిన యన్టీఆర్ ట్రస్ట్ కి సమీపంలో ఉన్న ఒక బ్యాంక్ నుండి తెదేపా యంపీ సీయం రమేష్ కి చెందిన ఖాతా నుండి తీసినట్లు ఇంతకు ముందు వైకాపాకు చెందిన మీడియాలో ప్రచారం జరిగింది. దానిని రమేష్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఆ డబ్బు తన ఖాతాలో నుండి తీసినట్లు నిరూపించినట్లయితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని సవాలు చేసారు. అంతేకాదు తన గౌరవానికి భంగం కలిగించినందుకు ఆ మీడియాకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు కూడా ఆయన సిద్దపడ్డారు. దానితో ఆయనకి వ్యతిరేకంగా పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారందరూ వెనక్కి తగ్గవలసి వచ్చింది.
నిన్న హైకోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారిస్తున్నప్పుడు ఎసిబి తరపున వాదించిన తెలంగాణా అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయం ఇంకా రాబట్టవలసి ఉంది కనుక రేవంత్ రెడ్డిని బెయిల్ పై విడుదల చేయవద్దని వాదించారు. అంటే ఎసిబి అధికారులకి కూడా ఆ డబ్బు ఎక్కడి నుండి తీసుకువచ్చేరు? ఎవరు ఇచ్చేరు? అనే విషయం తెలియదని స్పష్టం అవుతోంది. కానీ ఆ డబ్బు గురించి ఎసిబి అధికారులకి తెలియకపోయినా మీడియాలో ఒక వర్గం ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలిసిందని పనిగట్టుకొని ప్రచారం మొదలుపెట్టడం గమనిస్తే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా కొన్ని బలమయిన శక్తులు పనిచేస్తున్నాయని స్పష్టం అవుతోంది.
హైదరాబాద్ లో అమీర్ పేట కు చెందిన ఒక చిట్ ఫండ్ సంస్థ నుంచి ఆ డబ్బు తీసినట్లు ఎసిబి అధికారులు కనుగొన్నారని మీడియాలో ప్రచారం మొదలయింది. ఆ సంస్థ యజమాని కృష్ణాజిల్లాకి చెందినవాడని ఆయనకి ఫైనాన్స్ బిజినస్ కూడా ఉందని పేర్కొనడం చూస్తే వారి తరువాత లక్ష్యం ఎవరో చూచాయగా అర్ధమవుతోంది. ‘ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు...భావిస్తున్నారు...’ అంటూ ఊహాజనితమయిన వార్తలు ప్రచురించడం చూస్తుంటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయో అర్ధమవుతోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండటం, అటువంటివారిని అంతే ధీటుగా ఎదుర్కోవడం చాలా అవసరం.