ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహకారమే కీలకం
posted on Mar 12, 2015 9:52AM
.jpg)
రాష్ట్ర విభజన తరువాత తీవ్ర ఆర్ధికసమస్యలలో చిక్కుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అందులో నుండి బయటపడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ ఇంతవరకు కేంద్ర సహకారం లేకపోవడంతో పరిస్థితుల్లో పెద్ద మార్పు కనబడటంలేదు. రాష్ట్రం విద్యుత్ సమస్యలను అధిగమించగలిగింది గానీ ఇంకా ఆర్ధిక సమస్యలను మాత్రం అధిగమించలేకపోతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారం కోరుతోంది. తీవ్ర ఒత్తిడి వచ్చిన తరువాత ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వంలో చిన్న కదలిక కనబడుతోంది. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న భేటీ అయ్యి రాష్ట్రానికి అవసరమయిన నిధులు, ఇతర ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకొన్నారు. బహుశః త్వరలోనే నిధులు విడుదల కావచ్చును. నిధులు విడుదల అయితే పనులు కూడా మొదలవుతాయి. మే నెల రెండవ వారంలో రాజధాని నిర్మాణానికి శంఖు స్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా వచ్చే ఎన్నికలలోగా పోలవరం ప్రాజెక్టు, మెట్రో రైల్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనుకొంటోంది. ఈ మూడూ పూర్తికావాలంటే కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేస్తుండాలి.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఉన్న రాజకీయ మరియు సాంకేతిక ఇబ్బందులను గమనిస్తే అది అసాధ్యమనే స్పష్టమవుతోంది. అయినా ఇస్తామని కేంద్రం హామీ ఇస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఒత్తిళ్ళకి తలొగ్గి ఇస్తామని హామీ ఇచ్చి ఆ తరువాత ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తే దాని వలన బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ఇంకా చెడ్డపేరు వస్తుంది. కనుక సాధ్యం కాదనుకొన్నప్పుడు హామీలతో కాలక్షేపం చేయడం కంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం గురించి మాట్లాడుకొని అందుకు ప్రత్యామ్నాయంగా ఏమిచేయవచ్చో అది చేస్తే వాటిపైనా ఈ ఒత్తిడి తగ్గుతుంది. దాని వలన రాష్ట్రానికి కొత్త ఐటి, వాణిజ్య, పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఆర్ధిక సమస్యల నుండి బయటపడాలంటే అందుకే ఇదే ఏకైక మార్గం. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కు కొనేందుకు కేంద్రం ఇప్పుడు సహాయసహకారాలు అందించినట్లయితే, దానిపై రాష్ట్రం ఆధారపడటం కూడా తగ్గుతుంది. తిరిగి కేంద్రానికే ఆదాయం సమకూర్చగలుగుతుంది.