ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రానికి, బీజేపీకి కూడా మంచిదే
posted on Nov 9, 2014 11:44AM
.jpg)
రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిస్తామని మోడీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ కేవలం సాంకేతిక కారణాల వలననే ఆలస్యం జరుగుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడంతో ప్రజలు కూడా అపార్ధం చేసుకొంటున్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఇటీవల ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని ఇదే విషయం గురించి మాట్లాడేందుకు కలిసినప్పుడు, మరొక రెండు వారాలలోగా కేంద్రప్రభుత్వం ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల నుండి రాష్ట్రానికి చెందిన కొన్ని ఫైళ్ళు రావలసి ఉందని, అవి రాగానే తక్షణమే ప్రత్యేక హోదాపై ఒక నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు.
స్వంతంగా రాజధాని కూడా లేని రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా అయినా కేటాయిస్తే తప్ప భారీ పరిశ్రమలు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపవు. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడటం కష్టం. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రోక్కుకోనంత కాలం నిధుల కోసం కేంద్రంపైనే ఆధారపడక తప్పదు కనుక అది కేంద్రానికి కూడా భారంగానే ఉంటుంది. అందువలన రాష్ట్రం తిరిగి తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేసేందుకు కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేక హోదా ప్రకటించవలసిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడం వలన కేవలం రాష్ట్రానికే కాక కేంద్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది.
అనేక పెద్ద, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పరిశ్రమలు పెడదామనే ఆలోచనతో వేచి చూస్తున్నారు. ఇంకా ఆలశ్యం చేసినట్లయితే వారు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తరలిపోయే అవకాశాలున్నాయి. అదేజరిగినట్లయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి భారీ పరిశ్రమలను, ఐటీ సంస్థలను రప్పించేందుకు చేస్తున్న కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. త్వరలో ఆయన ఇదే పనిమీద సింగపూరు కూడా వెళ్ళబోతున్నారు. అందువల్ల కేంద్రప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే ఆయనే రాష్ట్రాన్ని చక్కబెట్టుకోగలరు. ఎన్డీయే ప్రభుత్వం మిత్రధర్మం పాటిస్తూ రాష్ట్రానికి ఉదారంగా సహాయపడితే రాష్ట్రంలో ప్రజలు కూడా బీజేపీని ఆదరించే అవకాశం ఉంటుంది.