ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సత్యప్రమాణం! అనపర్తిలో తగ్గని హై టెన్షన్ 

తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి నియోజకవర్గంలో హై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే  సత్తి సూర్య నారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాళ్లతో ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు నేతలు అన్నట్లుగానే బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేశారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి తన భార్యతో కలిసి ఆలయానికి వచ్చి మొదట సత్యప్రమాణం చేసి వెళ్లారు. తర్వాత  10 నిమిషాలకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సతీసమేతంగా వచ్చి సత్యప్రమాణం చేశారు. మైనింగ్ అంశంలో ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న  నేతలు గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకున్నారు. ఇద్దరు నేతలు వచ్చి సత్యప్రమాణం చేసి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తాజా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిల మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు  చేసుకుంటున్నారు. బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి రూ. 400 కోట్లు దోచుకునేందుకు  ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రయత్నించారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అక్రమ గ్రావెల్ మైనింగ్ చేసేందుకు ఆలోచన లేకపోతే నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి  కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారు.  ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్‌పై టీడీపీ ఫిర్యాదు చేయటం వల్ల మైనింగ్ అధికారులు స్పందించారని అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై ఒక కోటి 22 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. 

అయితే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఆరోపణలకు తాజా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కౌంటరిచ్చారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న  రామకృష్ణా రెడ్డి ఐదేళ్ళ పాటు అవినీతికి పాల్పడ్డారని సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. నల్లమిల్లి హయాంలో కలెక్షన్ కింగ్‌లు, క్వీన్స్ ఉన్నారని ఆరోపించారు. నల్లమిల్లి తనపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, ఆధారాలు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరు నేతల రాక సందర్భంగా  బిక్కవోలులో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ తో పాటు 30 పోలీసు చట్టాన్ని అమలు చేశారు.