ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహానికి అపచారం

దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం (అక్టోబర్ 11) అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు.హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏటా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో దసర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నారు. గురువారం(అక్టోబర్ 11) రాత్రి దాండియా కార్యక్రమం జరిగింది. దీనికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. రద్దీ భారీగా ఉన్నందను పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే దాండియా పూర్తికాగానే జనంతో పాటు పోలీసులు కూడా వెళ్లిపోయారు. ఆ తరువాతే విగ్రహ ధ్వంసం జరిగింది. 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  అమ్మవారి విగ్రహ ధ్వంసంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమ్మవారి విగ్రహ ధ్వంసం హిందుత్వపై జరిగిన దాడిగా వారు పేర్కొంటున్నారు.