మేం కేసులు పెడతాం.. మీరు లాగేసుకోండి! ఏపీలో టీడీపీ టార్గెట్ గా జాయింట్ స్కెచ్
posted on Jan 22, 2021 10:38AM
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సూత్రం ఎక్కడైనా వర్తిస్తుంది. రాజకీయాలకు అయితే మరింతగా దగ్గరగా ఉంటుంది. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శత్రువులు ఉండరంటారు. కలిసున్న నేతలు విడిపోతుంటారు.. బద శత్రువులుగా ఉన్నవారు ఏకమవుతుంటారు. తమ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి మరో ప్రత్యర్థితో రాజీ చేసుకుంటూ ఉంటారు పొలిటికల్ లీడర్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులు చూస్తున్న వారికి ఇది ఇట్టే అర్ధమవుతోంది. కేంద్రం డైరెక్షన్ లోనే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. టీడీపీ బలహీనం అయితేనే అది సాధ్యమని భావిస్తోంది. అంతేకాదు 2019 ఎన్నికల్లో తమతో విభేదించి.. ప్రధాని మోడీ. అమిత్ షాకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయడాన్ని ఇంకా మర్చిపోలేకపోతోంది. అందుకే పార్టీ బలోపేతంతో పాటు చంద్రబాబుపై ప్రతీకారం తీసుకోవాలనే కసితో ఉంది కమలం పార్టీ. అందుకే టీడీపీని టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇందు కోసం కొత్త ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది. అందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సహకారం తీసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. టీడీపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కేసుల పెట్టి వేధించడం.. తర్వాత బీజేపీ ఎంటరై తమ పార్టీలో చేరితే రక్షణ కల్పిస్తామని వారికి హామీ ఇవ్వడం... ఇది ఆ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహమని తెలుస్తోంది. టీడీపీని బలహీనం చేయాలని బీజేపీ చూస్తుండగా... టీడీపీ తమకు కూడా ప్రధాన ప్రత్యర్థి కావడంతో వైసీపీ కూడా అందుకు సరే అన్నదని తెలుస్తోంది. ఏపీలో టీడీపీని ఖతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, వైసీపీలు ఈ తరహా రాజకీయాలకు తెర తీశాయనే చర్చ జరుగుతోంది.
ఈ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహంలో భాగంగానే పోలీసు కేసులు, అరెస్టులు జరుగుతున్నాయన్నది టీడీపీ నేతల మాట. బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్న టీడీపీ నేతలే ... ఇటీవల పోలీసు కేసుల బాధితులుగా ఉంటుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చాకా ఎక్కువ టార్గెట్ అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయితే జేసీ ఫ్యామిలీ బీజేపీలోకి వెళుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలు జేసీ బ్రదర్స్ తో మాట్లాడారని కూడా చెప్పారు. కాని వాళ్లెవరు బీజేపీలోకి చేరలేదు. అందుకే వాళ్లపై పార్టీ మారేలా ఒత్తిడి పెంచడానికే కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజాంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. కళా వెంకట్రావును బీజేపీలోకి రావాలని సోము వీర్రాజు ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే ఈ అరెస్ట్ జరిగింది. దీంతో కళా వెంకట్రావును టీడీపీ నుంచి బయటికి లాగేందుకే అరెస్టు జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
నిజానికి 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి భారీగా తమ పార్టీలోకి వలసలుంటాయని భావించారు కమలం పార్టీ నేతలు. అయితే అలాంటేది లేదు. తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుండగా ఏపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఒకరిద్దరు పేరున్న నేతల తప్ప మిగిలిన వాళ్లు కమలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అమిత్ షా ఆదేశాలతో టీడీపీ నుంచి నేతలను ఆకర్షించేందుకు ఏపీ బీజేపీ నేతలు నయా ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి చెరితే వైసీపీ నుంచి వేధింపులుండవని, పార్టీలో చేరితే చాలు వైసీపీ అసలు పట్టించుకోదని రహాస్య మీటింగ్స్ లో చెబుతున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. 2019 ఎన్నికల తర్వాత ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీదీ వెంకటేష్ తో పాటు ఆదినారాయణ రెడ్డి, రావేల కిషోర్ బాబు, వరదాపురం సూరి వంటి నేతలు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి వాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మీరు కూడా పార్టీలోకి వస్తే మీకు ఏ ఇబ్బందులు ఉండవని అభయం ఇస్తోన్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలను ఇలాంటి ఆఫర్లతోనే ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు సోమువీర్రాజు అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చేరికలే లేకపోవడంపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టార్గెట్స్ సెట్ చేసి మరి పార్టీలోకి అవకాశం ఉన్న నేతలందరి చేర్చుకోవాలని వీర్రాజుపై ఒత్తిడి చేస్తోన్నట్లు సమాచారం. అందులో భాగంగానే సోమువీర్రాజు కూడా గ్రౌండ్ వర్క స్టార్ చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న నేతలతో నేరుగా ఫోన్ సంభాషణలు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. తమ పార్టీ వద్ద ఉన్న ఆఫర్స్ వాళ్ల ముందు పెట్టి ఆలోచించుకోమని చెబుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన కళా వెంకట్రావుతో నేరుగా మాట్లాడారనే చర్చ కూడా జరుగుతోంది.