అమిత్ షా నోట మధ్యంతరం మాట.. ఎందుకంటే?

 

కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే కూటమిలో ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి లేదా? సొంతంగా మెజారిటీ లేకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే చాతుర్యం, సమర్థత మోడీలో కొరవడింది. అన్నీ నేనే.. అంతా నేనే అన్నట్లుగా పదేళ్ల పాటు ఎన్డీయే ప్రభుత్వాన్ని నడిపిన మోడీకి భాగస్వామ్య పార్టీలను గుర్తించడం, వాటిని అనివార్యంగా సముచిత ప్రాధాన్యతను ఇవ్వాల్సి రావడం కష్టంగా ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

తాజాగా అమిత్ షా  జమిలి ప్రస్తావన తీసుకు వచ్చారు. అదేమీ కొత్త కాదు.. గత పదేళ్లుగా అవసరం ఉన్నా లేకపోయినా మోడీ, షా జోడీ జమిలి జపం చేస్తూనే వస్తోంది. ఇప్పుడు అమిత్ షా జమిలి అనడంలో కొత్తేం లేదు. కానీ.. ఆయన జమిలి ఎన్నికలు అని ఊరుకోలేదు. అవసరమైతే మధ్యంతర ఎన్నికలకు కూడా వెనుకాడబోమని చెప్పారు. దీంతోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడిపే విషయంలో మోడీ అడుగులు తడబడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో  అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం సాధ్యంకాదని  బీజేపీ  జమిలీ మాటఎత్తిన ప్రతిసారీ విపక్షాలు ఖండిస్తూ వస్తున్నాయి.  అయితే బీజేపీ మాత్రం జమిలీ ఎన్నికలు తమ అజెండా లో భాగమని,తప్పక అమలు చేస్తామని చెబుతూ వస్తోంది.   ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఇటీవల జమిలితో పాటు మధ్యంతరం అన్న మాట అనడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది.  

వరుసగా మూడో సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువుదీరింది. అయితే గత రెండు సార్లకు భిన్నంగా ఈ సారి భాగస్వామ్య పక్షాల కరుణాకటాక్షాలుంటేనే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుంది.  తెలుగుదేశం, జేడీయూ మద్దతుపైనే మోడీ సర్కార్ భవిష్యత్ ఆధారపడి ఉంది.  ఆ రెండు పార్టీలూ కూడా బీజేపీ హిందుత్వ అజెండా అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవు. ఆ విషయం మోడీ, షా జోడీకి తెలుసు.   అందుకే అమిత్ షా జమిలి ఎన్నికలతో పాటు మధ్యంతర ఎన్నికల జపం కూడా ప్రారంబించారు.  లోక్ సభ,  అసెంబ్లీ ఒకేసారి జరిగితే.. ప్రాంతీయ పార్టీల హవా నడవదనీ, స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలకే ప్రాధాన్యత పెరిగి బీజేపీకి ప్లస్ అవుతుందన్నది కమలనాథుల అంచనా.  జమిలి ఎన్నికలతో దక్షిణాది రాష్ట్రాలలో కూడా బలోపేతం కావొచ్చునన్నది బీజేపీ ఆశ. ఆ కారణంతోనే అమిత్ షా నోట జమిలితో పాటు మధ్యంతరం మాట కూడా వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2026లో యూపీ, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో జమిలికి ముహూర్తం పెడితే అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నది బీజేపీ భావనగా చెబుతున్నారు.