జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా ఆహ్వానం.. కారణమేమిటంటే?

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా నుంచి ఆహ్వానం అందింది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన అమిత్ షా నోవాటెల్ హోటల్ లో బస చేశారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు రావాలని అమిత్ షా నుంచి ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. తనతో డిన్నర్ సమావేశానికి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లు, అందుకు జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినట్లు  విశ్వసనీయంగా తెలిసింది.

దీంతో అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ  భేటీ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు  సభకు వచ్చిన అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా భేటీకి ఆహ్వానించడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు.  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అమిషాల భేటీని చూడాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భేటీ సందర్భంగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తారని తెలిసింది.

ఒక వేళ అందుకు జూనియర్ ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఆయనను తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 30 స్థానాలలో తెలుగుదేశం పార్టీకి ప్రభావమంతమైన ఓటు బ్యాంకు ఉంది. అంతే కాకుండా తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుల ఓటు అత్యంత కీలకం. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో అత్యధికులు తెలుగుదేశం మద్దతుదారులే అన్న అంచనాతో.. ఉన్న బీజేపీ వారి ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.  

తెలుగుదేశం పార్టీకి ఏపీలో మద్దతు ఇవ్వడానికి అందుకు ప్రతిగా తెలంగాణలో తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇరు పార్టీల మధ్యా ఇప్పటికే ఒక అవగాహన కుదిరిందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు సైతం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించే అవకాశం ఉందని, ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ అందుకు సుముఖంగా లేకపోతే తెలంగాణ తెలుగు దేశం అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరే అవకాశం ఉందనీ అంటున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం బలానికి, ఆ పార్టీ తెలంగాణ శాఖకు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. మరింత బలోపేతం అవుతుందని బీజేపీ భావిస్తున్నది. దీంతో తెలుగుదేశం అండతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం మరింత సులభతరమౌతుందని బీజేపీ ఆశిస్తున్నది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో మునుగోడులో ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.