అమరావతి ఫ్లడ్ ఫ్రూఫ్.. మంత్రి నారాయణ
posted on Aug 23, 2025 1:19PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఫ్లడ్ ఫ్రూఫ్ నగరమని మంత్రి నారాయణ అన్నారు. ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా అమరావతికి వరద ముప్పు లేదనీ, ఉండదనీ విస్పష్టంగా చెప్పారు. వెస్ట్ బైపాస్ రోడ్డు వెనుక భాగం రోడ్డు ఎత్తు పాతిక అడుగులు ఉండాలనీ, ప్రస్తుతం నడుస్తున్న పనుల కారణంగా ఆ ప్రాంత మంతా బురదమయంగా మారిందని వివరించారు. ఆ కారణంగానే నీరు తాత్కాలికంగా వెనక్కు పారిందన్న మంత్రి నారాయణ, ఆ నీటిని మళ్లించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు.
అమరావతికి వరద ముప్పు అనేది ఉండకుండా అత్యాధునిక నెదర్లాండ్స్ సాంకేతికతను ఉపయోగించినట్లు చెపపారు. అమరావతి ముంపునకు గురైందంటూ వైసీపీ సోషల్ మీడియా, ఇతర వేదికలపై నుంచి చేసిన ఆరోపణలు, విమర్శలకు మంత్రి నారాయణ కొట్టిపారేశారు. ప్రజలు ఎటువంటి ఆందోళనకూ గురి కావలసిన అవసరం లేదన్నారు. వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన పులస వ్యాఖ్యలను కూడా నారాయణ కొట్టిపారేశారు. ఇలాంటి అసత్య ప్రచారాల పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. అమరాతి ప్రజారాజధాని అని ఉద్ఘాటించిన ఆయన ప్రజల ఆశలూ, ఆకాంక్షలకు అనుగుణంగానే అమరావతి నిర్మాణం ఉంటుందన్నారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని నారాయణ హెచ్చరించారు.