అమరావతిలో ఆందోళనలు ఉగ్రరూపం... 29 గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ...

అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ పదిరోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోన్న 29 గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని గ్రామాల రైతులు, ప్రజలకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, విద్యార్ధులు సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అమరావతి రైతులు, ప్రజల నిరసనలతో మందడం గ్రామం అట్టుడుకుతోంది. రోడ్లను దిగ్బంధిస్తున్న రైతులు వాహన రాకపోకలకు అడ్డుకుంటున్నారు. మరోవైపు రాజధాని గ్రామాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. మల్కాపురం, వెలగపూడి ప్రధాన కూడలి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లే మార్గాల్లో బలగాలను మోహరించారు. 

అలాగే, మందడంలో గ్రామస్తులెవరూ బయటికి రాకుండా 144 సెక్షన్ విధించారు. అలాగే, తుళ్లూరులో 700మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 29 రాజధాని గ్రామాల్లోనూ పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు... దుకాణాలను తెరిచేందుకు కూడా అనుమతి నిరాకరించారు. దాంతో, అమరావతిలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎటుచూసినా పోలీసులే కనిపిస్తుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

ఇక, మంగళగిరి నిడమర్రులో ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతోన్న ఆందోళనకారులు... భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలంటూ కాలేజీ బస్సుపై దాడి చేశారు. బస్సు అద్దాలు పగలకొట్టారు. దాంతో, నిడమర్రులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలాగే, రాజధాని రైతులకు అండగా బీజేపీ మౌనదీక్ష చేపట్టింది. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు కూర్చున్నారు.