ఏపీ శంకుస్థాపన.. మోడీ వరుస ట్వీట్లు
posted on Oct 23, 2015 12:17PM

ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి.. ఆ తరువాత తిరుమల బాలాజీని దర్శించుకున్న నేపథ్యంలో ఆయన ట్విట్ట్రర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపిందని.. నూతన రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించేందుకు ముందడుగు వేసిందని.. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు పార్లమెంట్ నుండి మట్టిని, యమునా నది నుండి నీటిని తీసుకెళ్లి చంద్రబాబుకు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం తాను చేసిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. శంకుస్థాపన అనంతరం తాను బాలాజీ దర్శనార్దం తిరుమల వెళ్లానని.. అక్కడ బాలాజీని దర్శించుకొని ప్రార్ధనలు జరిపానని, అనంతరం అక్కడి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్ ను ప్రారంభించానని ట్విట్టర్ లో తెలిపారు.
