మరోసారి ఆశల పల్లకిలో కమేడియన్ అలీ!.. గుంటూరు వైసీపీ అభ్యర్థిగా అవకాశం?

 చట్టసభకు కమేడియన్ అలీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంత కాలంగా ఆశపడి భంగపడుతూ వచ్చిన అలీకి వైసీపీ అధినేత జగన్ మరో సారి తాయిలం ఖాయమని సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో అలీని గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీకి దింపనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుంటూరు -2 అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా పై జగన్ ఒకింత ఆగ్రహంగా ఉన్నారనీ, ఆయన పని తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారనీ చెబుతున్నారు. అదే విధంగా ప్రజలలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉందన్న సర్వేల సమాచారం ఆధారంగా వచ్చే ఎన్నికలలో ఆయనను తప్పించి అలీకి పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

అన్నిటికీ మించి జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో గూడుకట్టుకున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకూ , సాధ్యమైనన్ని నియోజకవర్గాలలో కొత్త ముఖాలను రంగంలోనికి దింపాలని జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే గ్లామర్, పాపులారిటీలను దృష్టిలో ఉంచుకిని సాధ్యమైనంత వరకూ సినీ రంగానికి చెందిన వారిని పార్టీలోకి తీసుకువచ్చి ప్రయోజనం పొందాలని కూడా వైసీపీ అధినేత భావిస్తున్నట్లు వైసీపీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే గుంటూరు నుంచి  అలీని అసెంబ్లీకి పంపాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

గత ఎన్నికలకు ముందు కూడా అలీ గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశపడిన సంగతిని ఈ సందర్భంగా చెబుతున్నారు. అయితే అప్పట్లో అలీకి అసెంబ్లీ టికెట్ దక్కలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా రాజ్యసభకు పంపుతారనీ, ఏదో ఒక కార్పొరేషన్ కు చైర్మన్ చేస్తారని మరోసారి అలీని ఆశల పల్లకిలో ఊరేగిస్తూ మూడున్నరేళ్లు  గడిపేసిన జగన్.. ఈ సారి అలీకి మరో తాయిలం ఎరవేశారని విశ్లేషకులు అంటున్నారు.

ఇక మరో నటుడు పోసాని కృష్ణమురళికి కూడా ఈ సారి అసెంబ్లీకి పంపాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం తరఫున చిలకలూరి పేట నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పోసానికి అదే నియోజకవర్గం నుంచి ఈ సారి వైసీపీ అభ్యర్థిగా దింపాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.చిలకలూరి పేట నియోజకవర్గంలో అంతర్గత విభేదాల నేపథ్యంలో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం ద్వారా వర్గ పోరుకు చెక్ పెట్టినట్లవుతుందని జగన్ భావిస్తున్నారంటున్నారు.

ఏది ఏమైనా ఈ సారి మూడోంతుల మంది సిట్టింగ్ లకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే జగన్ అన్యాపదేశంగా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుంటూరు, చిలకలూరి పేటల నుంచి అలీ, పోసానిలకు లైన్ క్లియర్ అయ్యిందన్న టాక్ వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది.