బెంబేలెత్తిస్తున్న ఎయిర్‌ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ఫ్లైట్లు

బోయింగ్ డ్రీమ్‌లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్‌వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణీకులు భయపడే పరిస్థితులు నొలెకొన్నాయి. ఎయిరిండియాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు దానికి కారణమవుతున్నాయి. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలలోనే   కుప్పకూలిన ఘటన  మరవకముందే.. మరిన్ని విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడటం కలవరపెడుతోంది. తాజాగా అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఎదురైంది. టేకాఫ్‌కు ముందే సమస్యను గుర్తించడంతో ఈ సర్వీసును రద్దు చేశారు.

ఎయిరిండియా ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానంలో తనిఖీలు చేస్తుండగా.. సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో టేకాఫ్‌ నిలిపివేసి సర్వీసును రద్దు చేశారు. గత వారం నాటి విమాన ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్‌ విమానం ఇదే కావడం గమనార్హం. 

జూన్‌ 12న అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఏఐ 171 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకేఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇక విమానం నివాస సముదాయంపై పడటంతో మరో 33 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత  ఏఐ 171 ఫ్లైట్‌ నంబర్‌ను ఎయిరిండియా పక్కనబెట్టింది. దాని స్థానంలో ఏఐ 159 నంబరును వినియోగించింది. ఇప్పుడదే సిరీస్‌ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. 

మరోవైపు, ఈ ఘటన తర్వాత పలు ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి వెళ్తున్న ఏఐ 180 విమానంలో సమస్య రావడంతో దాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu