తెలంగాణ పై మళ్ళీ అదే వాదన !
posted on Feb 22, 2013 10:44AM
తెలంగాణా "మిగులు ఆదాయా''న్ని (సర్ ప్లస్) తెలుగు సోదరులు మింగారా? మళ్ళీ అదే వాదన !
- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

పాడిందే పాడటం కొందరికి వదిలించుకోడానికి వీలుకాని అలవాటు. అలాగే, తెలంగాణా "మిగులు'' ["సర్ ప్లస్'']ను రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలవారూ మింగేసి తెలంగాణాకు తొంటిచెయ్యి చూపుయాన్నారన్న అపవాదును మరోసారి కొందరు తెరపైకి తెస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ఫలితంగానే తెలంగాణాలోని తెలుగుప్రాంతాలూ, ఆంధ్రలోని తెలుగుప్రాంతాలూ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి తెలుగుజాతంతా సమైక్యం కావడం సాధ్యమయింది. ఇది చారిత్రిక సత్యం. ఈ రెండు తెలుగుప్రాంతాల విలీనీకరణ సందర్భంగా, అప్పటికి మొగలాయిల (ముస్లీం) పరాయిపాలనలో విద్యకు, ఆరోగ్యానికి, సామాజికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికీ మాతృభాషగా తెలుగు వాడకానికి నోచుకోని ఫలితంగా బ్రిటిషాంధ్రటో పోల్చినప్పుడు తెలంగాణా వెనుకబడి ఉన్నందున దానికి రక్షణలు కల్పిస్తూ విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు "పెద్దమనుషుల ఒప్పందం'' కుదిరింది. దానికి తగినట్టుగా నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయప్రాంతాల నాయకుల మధ్య "మాట'' ప్రకారం ఆ రక్షణలు క్రమంగా అమలులోకి వచ్చాయి; ఒప్పందం అమలులో క్షేత్రస్థాయిలో కొన్ని ఒడిదుడుకులూ జరిగి ఉండవచ్చు. కాని అవి క్రమంగా తొలగిపోతూ వస్తున్నాయి. అయితే "పెద్దమనుషుల ఒప్పందం'' పైన సంతకాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరుప్రాంతాలకు చెందిన మంత్రులూ, కడచిన 56 ఏళ్ళుగానూ ఉన్నందున, ఒకవేళ "ఒప్పందం' అమలులో ఒడిదుడుకులు జరుగుతున్నప్పుడు, వాటిని పసికట్టి తొలగించవలసిన బాధ్యత ఉభయప్రాంతాల మంత్రులకూ ఉండాలి.
దేశానికి స్వాతంత్ర్య (1947 ఆగస్టు) ప్రకటన జరిగిన తరువాత రెండేళ్ళ దాకా [1950 జూన్ వరకు] తెలుగువారి తెలంగాణా ప్రాంతం నిజాం పాలకుల నిరంకుశ రాజ్యంలో భాగంగానే ఉంటూ వచ్చింది. ఎటుతిరిగీ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాల చాటున ప్రవేశించిన యూనియన్ సైన్యాల రాకతో ఈ ప్రాంతానికి పూర్తిగా నిజాం పాలననుంచి రాజకీయ విమోచనం లభించింది. 1952 జనవరిలో దేశపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మొదటిసారిగా ఎన్నికల కోలాహలం చెలరేగింది.అందులో కాంగ్రెస్ ఒక పక్షంగాను, జయసూర్య నాయకత్వంలో కమ్యూనిస్టులు "ప్రజాతంత్ర ప్రజాస్వామ్య ఐక్యసంఘటన'' (పి.డి.ఎఫ్.)గా ఏర్పడి సంయుక్త ప్రతిపక్షంగా ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో 1952 మార్చిలో హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వం ఏర్పడింది.
బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 1956 అక్టోబర్ ఆఖరిదాకా కొనసాగింది. కాగా 1955లో ఒకే భాషాసంస్కృతులు గల జాతి ప్రాతిపదికగా ఐక్య రాష్ట్రం ఏర్పడాలని తెలుగుప్రాంతాలన్నిటా ఆందోళన సాగింది. ఫలితంగా కేంద్రం ఈ సమస్యపైన ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పరచింది. ఈ కమీషన్ అభిప్రాయ సేకరణ తర్వాత నివేదిక సమర్పిస్తూ "భట్టిప్రోలు పంచాయితీ'' ధోరణిలో రెండు పరిష్కారాలు పరస్పరవిరుద్ధంగా సూచించింది. (1) తెలుగుప్రాంతాలన్నింటి ప్రగతికోసం, భవిష్యత్తులో వాటి భద్రతకోసం అవి విశాలాంధ్రగా ఏర్పడడం అన్నివిధాలా మంచి పరిష్కారమవుతుంది. (2) కాని, తెలంగాణా ప్రాంతంలో కొందరి అభిప్రాయం ప్రకారం "తెలంగాణా ప్రాంతం వెనుకబడినదిగా ఉండుటచే'' [మందుముల నరసింగరావు: "50 సంవత్సరాల హైదరాబా''దు] ప్రత్యేక రాష్ట్రంగా ఉండవచ్చునని కోరుకుంటున్నారు, అని కమీషన్ తెల్పింది. అలా కొందరు నాయకులు [వారిలో ప్రముఖులు బడా భూస్వాములయిన కొండా వెంకటరెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి] వెలిబుచ్చిన కోరిక నెరవేరనప్పుడు 1956లో "తెలంగాణా ప్రత్యేక రక్షణలు'' ఆధారంగా ఏర్పడిందే "ఆంధ్రప్రదేశ్''. నిజానికి అప్పటికి, అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరేళ్ళ నాటికి విశాలాంధ్రలో అంతర్భాగమైన ఒక్క తెలంగాణా ప్రాంతమేగాక యావత్తు దేశంలోనూ అంతవరకూ భూస్వామ్యవ్యవస్థ కారణంగానూ, బ్రిటిష్ వాడి పరాయి పాలనవల్లనూ అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మన ఇరుగుపొరుగైన మైసూర్, మహారాష్ట్రలు కూడా ఉన్నాయి.
కాని హైదరాబాద్ (స్టేట్) రాష్ట్ర శాసనసభలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు ఐక్య కర్నాటక, సంయుక్త మహారాష్ట్రల ఏర్పాటుకు పూర్తీ మద్ధతు పలుకగా [అప్పటికి ఆ ప్రాంతాలూ బాగా వెనుకబడి ఉన్నవే] తెలుగు మాట్లాడే తెలుగు ప్రజాప్రతినిధులయిన సభ్యులు కొందరిలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ భిన్నాభిప్రాయానికి నాయకత్వం అనేక దశాబ్దాల తరబడిగా తెలంగాణా ప్రజాబాహుళ్యాన్ని పీల్చి పిప్పి చేసిన నిజాం, అతనికి తోడుగా భూస్వామ్య, బడాజాగీర్ధారీ, 'దోర'లకు సంబంధించిన ప్రతినిధులే కావడంవల్ల స్వార్థ ప్రయోజనాల కోసం విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ పరిస్థితి కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలకు లేదు. అందుకే, ఈ భూస్వామ్యవర్గ నాయకులే [తెలంగాణా సాయుధ పోరాట అగ్రగాములలో ఒకరైన భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్నట్టుగా] "తెలుగుజాతి ఐక్యతకు వ్యతిరేకులుగాని తెలంగాణా ప్రజలు మాత్రం కార''నీ అప్పటికీ, ఇప్పటికీ రుజువవుతున్న సత్యం! అందుకే ఆలోచనాపరుడైన ఆనాటి శాసనసభ్యుడు ఎల్.ఎన్. రెడ్డి ఫజల్ ఆలీ కమీషన్ నివేదికను ప్రస్తావిస్తూ "ఈ కమీషన్ కూడా అటు పూర్తిగా విశాలాంధ్రకు మద్ధతు తెల్పకుండాను, ఇటు ప్రత్యేక తెలంగాణాకు వందశాతం అనుకూలంగా సిఫారసు చేయకపోవటం కూడా పరిస్థితిని క్లిష్టం చేసిందని చెప్పాలి'' అని వ్యాఖ్యానించవలసి వచ్చింది [02-04-1956]
సరిగ్గా ఈ అస్తుబిస్తు పరిస్థితులలోనే, తెలంగాణా గతంలో ఎప్పుడూ 'సర్ ప్లస్'' (మిగులు బడ్జెట్ తో) ప్రాంతం ఉండేదనీ, కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ 'సర్ ప్లస్' కాస్తా తెలంగాణాకు దక్కనివ్వకుండా కోస్తాలో ఖర్చుపెట్టారన్న అపవాదును కొందరు సోదర తెలంగాణా మిత్రులు ముందుకు నెడుతూ వచ్చారు. ఇంతకూ ఆ "కొందరు'' మాత్రమే పదేపదే పేర్కొంటున్న "తెలంగాణాకు ఉంటూ వచ్చిన సర్ ప్లస్ ఆదాయం'' ఎలా పేరుకుంది? ఎందుకు పేరుకుంది? అందుకు కారకులెవరు? ఒకవైపున తెలంగాణా ప్రాంతం నిజాంపాలన మూలంగా "దారుణమైన వెనుకబాటు తనా''న్ని అనుభవిస్తూ వచ్చిందని చెబుతున్నవారు, ఆ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి నిధులు ఉపయోగించి ఉన్న పక్షంలో "సర్ ప్లస్'' బడ్జెట్ మిగిలేది కాదుగదా! ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి "ఆంధ్రప్రాంతం ఆదాయం తరుగులో'' ఉంది కాబట్టి, తెలంగాణాకి జమకూడుతూ వచ్చిన మిగులు ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దరిమిలా కోస్తావాళ్ళు మింగేశారన్న ఆరోపణ సరైనది కాదు! ఎందుకంటే వెనుకబాటుతనానికి రెండు ముఖాలుంటాయి : (1) ఉన్న మిగులును ఎలాంటి ప్రజాసంక్షేమ పథకాలకు ఖర్చు చేయకుండా ఉన్నందువల్ల, లేదా (2) సంబంధిత ప్రాంతంలో ప్రజాహిత పథకాలను అమలు జరగకుండా స్వార్థప్రయోజనాలను ఆశించే పాలకుల వల్లనూ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, అంటే, 1956 నుంచి 2008 వరకూ కడచిన గత 56 సంవత్సరాలలోనూ విశాలాంధ్ర ఏర్పడిన తరువాత సోదర తెలంగాణా ప్రాంతంలో దాదాపు అన్నిరంగాలలోనూ [విద్య, వైద్య, పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల, వాహనాల పెరుగుదలలో, పారిశ్రామిక, వ్యవసాయక వగైరా రంగాలలో] సుమారు 130 శాతంనుంచి 300 శాతం దాకా అభివృద్ధి నమోదైనదని సాధికారిక గణాంకాలు నిరూపిస్తున్నాయి! వాటిని కాదని ప్రత్యామ్నాయ వాదనలతో వాస్తవాలతో వేర్పాటువాదులు ఇంతవరకూ ముందుకు రాలేదు. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు వేర్పాటువాదులు "మాకు లెక్కలువద్దు, ప్రత్యేక రాష్ట్రం'' మాత్రమే కావాలన్న మొండివాదనకు గజ్జెకట్టారు! ఏ ప్రజాహితమైన పనులమీదా ఖర్చు చేయనప్పుడు, "రూపాయి ఖర్చుకాకూడదు, బిద్దమాత్రం దుత్తల్లే ఉండాలి'' అన్నట్టుగా "మిగులు బడ్జెట్'' మిగులుగానే ఉండక తప్పదుకదా! స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రులు, తదితర ప్రజాహిత పథకాలను నిజాం ప్రభువులు గ్రామసీమల అభివృద్ధికోసం ఖర్చుపెట్టకుండా ఉన్నందుననే ఆ మిగులు తేలింది; కాని తన భోగవిలాసాలకు మాత్రం కొదవలేదు!ఖర్చు చేయనప్పుడు ఒక చోట మిగులు మరొక చోట కొరతకు కారణమవుతుంది!
1956 నుంచి 2008 వరకూ తేలిన "అభివృద్ధి'' గణాంకాల ప్రకారం చూసినప్పుడు, తెలంగాణా "మిగులును'' కోస్తాఆంధ్రలో వాడేసుకున్న మాటే నిజమయితే, సోదర తెలంగాణలో 130 శాతంనుంచి సుమారు 300 శాతం దాకా అభివృద్ధి ఎలా సాధ్యమో "సర్ ప్లస్'' వాదులు వివరించగలగాలి! తెలంగాణా నాయకులలో ఒకరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను రెండవ ప్రపంచయుద్ధానికి ముందూ, ఆ తరువాతా (1939 నుంచి 1948 దాకా) పరిస్థితిని చర్చిస్తూ హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు క్రమంగా ఎలాంటి సంకతంలోకి వెళ్ళాయో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు "తారుమారైపోయిన హైదరాబాద్ స్థితిగతుల''ను తన "50 సంవత్సరాల హైదరాబాదు'' గ్రంథంలో [''ఎమెస్కో'' ప్రచురణ : 2012] యిలా వివరించారు: యుద్ధానికి ముందు "గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ బడ్జెట్ మిగులుగానే ఉండేది. రాష్ట్రప్రభుత్వ ఆదాయపు పద్దులలో అంతవరకూ ఎలాంటి మార్పూ లేదు కూడా. కాని - దిగుమతి, ఎగుమతి వ్యాపారం సన్నగిల్లడం, రాకపోకల సౌకర్యాలు తగ్గటం వలన పరిస్థితులు కూడా చాలా తారుమారైనవి. (తెలంగాణాకు) బర్మానుంచి బియ్యం రావటంలేదు. కొన్ని జిల్లాల్లో క్షామపరిస్థితులు ఏర్పడటం వలన, రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నవి. తిండిగింజలలోటు ఏర్పడింది. ధరలు రోజుకు రోజు పెరుగుచుండెను. వస్తువులు మాయం కావటం ఆరంభమైనవి. దొంగబజారు, నిలవపెట్టడం, అక్రమ లాభాలు సంపాదించడమనే పరిభాష మొదటి పర్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో వాడుకలోకి వచ్చేసినది. ఆ పరిభాష అలాగే ఇప్పటివరకూ (యుద్ధానంతరం వరకూ) నిలిచిపోయినది''!
అంతేగాదు, అంతవరకూ హైదరాబాద్ రాష్ట్రంలో "ఆదాయంపైన పన్ను అనే విధానేమే లేద''నీ, బ్రిటిష్ పరిపాలిత సికింద్రాబాద్ భాగంలో మాత్రం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రెసిడెంట్, ఆదాయంపైన పన్ను వేశాడనీ, కాని హైదరాబాదులో మాత్రం ఆ పని చేయడం సులభం కాలేదనీ కూడా మందుముల రాశారు. ఈ సందర్భంలోనే ఆయన మన దేశీయ పాలకులను గురించి ఒక 'చెణుకు' విసిరారు " "మన దేశీయ పాలకులు 20వ శతాబ్దంలో జీవిస్తూ 18వ శతాబ్దపు పరిభాషలో ఆలోచిస్తూ ఉంటార''ని! అక్షరసత్యం మరోమాటలో చెప్పాలంటే ఆదాయపుపన్ను లేని సమయంలో సమకూడిన "రెవెన్యూ మిగులు''ను చూసారు.
ఇటీవల మరొక గమ్మత్తు రాజకీయాన్ని కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు ఆశ్రయించారు! ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద ఆర్ధిక, ప్రణాళికా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమర్ధుడైన అధికారి బి.పి.ఆర్. విఠల్ కూడా తెలంగాణా "సర్ ప్లస్'' ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఖర్చుచేసిన పధ్ధతి గురించి తప్పుపట్టారని వేర్పాటువాదులు కొందరు ఉదాహరిస్తున్నారు. ఇందుకోసం, రాష్ట్ర సమైక్యతను సమర్థిస్తున్న విఠల్ కుమారుడైన ఆచార్య సంజయ్ బారును విమర్శించడం కోసం తండ్రీ-కొడుకుల వాదనల మధ్య తగాదా పెట్టాలని వేర్పాటువాదులు చూశారు. కాని బి.పి.ఆర్.. విఠల్ ఒకనాటి తెలంగాణా మిగులు (సర్ ప్లస్) ఆదాయం గురించి దఫదఫాలుగా "సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్'' అని ప్రచురించిన ["A state in periodic crisises : Andhra Pradesh''] గ్రంథంలో చర్చించన తీరువేరు, వేర్పాటువాదులు ఆ పేరిట చేస్తున్న వాదన వేరు! తెలంగాణా ప్రాంతంలోని సొంత ఆదాయవనరులకు సంబంధించిన "మిగులు''ను ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించలేదన్న ఫిర్యాదును ప్రస్తావిస్తూ విఠల్ చేసిన వ్యాఖ్య ఇక్కడ పరిశీలిచదగినది: "ఈ మిగులు రెవెన్యూలను అంచనా కట్టె పద్ధతీ, సదరు మిగుళ్ళను ప్రభుత్వం ఉపయోగించిన పద్ధతీ ఈ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయాలలో దఫదఫాలుగా తలెత్తుతూ వస్తున్న సమస్యలు. అయితే, ఈ ప్రాంతీయ రాజకీయాలను అలావుంచి ఈ మొత్తం రెవెన్యూ మిగులు సమస్యను బడ్జెట్ రూపకల్పనకూ, రాజకీయాలకూ మధ్య ఒక సంబంధిత సమస్యగా అధ్యయనం చేయడానికి తగిన కేస్ స్టడీ'' కాగలదు! ఇంకా స్పష్టం చేయాలంటే - ఆర్ధిక సంబంధితమైన పాలనా వ్యవహారాలపైన శాసనవేదిక (లెజిస్లేచర్) అడుపాజ్ఞాలకు సంబంధించిన సమస్యగా దానిని అధ్యయనం చేయదగిన అంశం'' అని కూడా విఠల్ పేర్కొన్నారు! అంతేగాదు, ప్రాంతీయ రాజకీయాలనుంచి వివాదాలు తలెత్తి ఉండవచ్చు, కాని అంతమాత్రాన ద్రవ్య (ఆర్ధిక) పాలనకు చెందిన సమస్యల ప్రాధాన్యతనుంచి దృష్టి మళ్ళరాదనీ, ఇంతకూ మౌలికమైన సమస్యకు పునాది రాజకీయ ఒప్పందమనీ, ఇది రాజకీయ ఉద్యమం వల్ల మరింత జటిలమవుతుందనీ విఠల్ పేర్కొన్నాడు.
అధికారిగా ఆయన అంతకుమించి రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా ముందుకు వెళ్ళలేడు! ఈ సమస్య చిలికి చిలికి గాలివానలాగా కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య సమస్యగా తలెత్తుతుందనీ, చివరికి దీనికి పరిష్కారమల్లా రాజ్యాంగ సవరణ మాత్రమేనానీ విఠల్ చెప్పారు. అందుకే ఒక రాజ్యంగబద్ధ సంస్థగా ఆంధ్రప్రదేశ్ శాసనసభే తెలంగాణా ప్రాంతీయ కమిటీని నాడు సాధికారికంగానే ఏర్పాటు చేసిందనీ, ఈ కమిటీ ఉన్నతకాలం, చట్టరీత్యా తనకు సంక్రమించిన అధికారాల పరిథిలో, ప్రభుత్వం చేసే ఖర్చుపైన చాలా శక్తిమంతంగా అర్థవంతంగా ఆజమాయిషీ చేస్తూ వచ్చిందని కూడా విఠల్ అన్నారు! ఈ కమిటీ ప్రస్తావించే సమస్యల వెనక రాజకీయ పూర్వరంగం ఉన్నప్పటికీ తెలంగాణా ప్రాంతీయ కమిటీ మాత్రం తన విశ్లేషణలో గాని, సమస్యను వివరించడంలో గానీ పక్కా వృత్తి సంస్థగానే వ్యవహరిస్తుందని విఠల్ అన్నారు! ఈ సమస్యను వివరిస్తూ విఠల్ గారు ఆరోపణలు చేసేవారినందరినీ ఒకగాటున కట్టకుండా ఏకీకరణ మూలంగా తెలంగాణా "రెవెన్యూ మిగులు''ను కోస్తాఆంధ్రులు వాడుకుంటారన్న ఆందోళనను "కొంతమంది తెలంగాణా నాయకులు'' వ్యక్తం చేశారని స్పష్టం చేయడం గమనార్హం. ఆ "కొందరు'' నాయకులు "అందరి నాయకుల''నీ కాదు, వారు మొత్తం తెలంగాణా ప్రజాబాహుళ్యం అభిప్రాయాలను ప్రతిబిందిస్తున్నారనీ అర్థం కాదు! ఇంతకూ ఆ 'సర్ ప్లస్'' ఆదాయం ఏది? తెలంగాణలో వసూలయ్యే భావిస్తూ, ఎక్సైజ్ (ఆబ్కారీ) ఆదాయమూ. ఇది ఏడాదికి రూ.5 కోట్లు, ఆనాటికి రాష్ట్రాల పునర్వవస్థీకరణ (ఫజల్ ఆలీ) కమిటీ రాష్ట్రంగా ఏర్పడిన "ఆంధ్రరాష్ట్రం కొంతమేర ఆర్ధిక సమస్యను ఎదుర్కొంటూ వచ్చింద''నీ చెప్పిందేకాని ఆ "కొంత'' ఎంతో స్పష్టం చేయకుండా వదిలేసి కూర్చుంది! అలాగే మద్రాసునుంచి విడిపోయి ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో "తలసరి ఆదాయం తక్కువ''ని చెప్పిందేగాని, ఆ "తక్కువ'' ఎంతో గణాంకంలో తెలపకుండా చల్లగా జారుకుంది! కాని అనుమానాలు మిగిల్చి రెండు ప్రాంతాల మధ్య మనస్సులను చెడగొట్టడానికి ప్రయత్నించింది, ఇక "పెద్దమనుషుల ఒప్పందా''న్ని అమలు జరిపించుకునే బాధ్యతనుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని తెలంగాణా మంత్రులు తప్పుకుని పదవులను మాత్రం అనుభవిస్తూ వచ్చారు!
- [ మరిన్ని వివరాలు వచ్చే వ్యాసంలో]