అబ్దుల్ కలాం జీవిత విశేషాలు-2

 

అబ్దుల్ కలాం తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని. తల్లి ఆశి అమ్మ గృహిణి. వారిది నిరుపేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాల కోసం ఆయన చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ పాఠశాలలో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. ఆ తర్వాత యుద్ధ పైలట్ కావాలనే తన కలను ఒక్క స్థానం వెనుకబడటంతో కోల్పోయారు. ఆ తర్వాత కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ అండ్ ఎస్టాబ్టిష్‌మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద INCOSPAR కమిటీలో పనిచేశారు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.