ఎన్నికల షెడ్యూల్.. 'మే'లో ఎన్నికలు లేనట్టే!!

 

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలను మే మొదటి వారం వరకు నిర్వహించిన ఈసీ.. ఈసారి మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి.. ఏప్రిల్ నెలాఖరుతో క్లోజ్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. అంటే గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 15 రోజుల ముందే ప్రక్రియ మొదలుపెట్టి.. 15 రోజుల ముందుగానే ఎన్నికలను ముగించబోతున్నారట. ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం వాతావరణమని తెలుస్తోంది. తాజాగా కొన్ని ప్రపంచ సంస్థలు ఈ ఏడాది ఇండియాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను ఏప్రిల్ చివరి వారానికే పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. మరో రెండు వారాల్లో ఎన్నికల తేదీలతో కూడిన షెడ్యూల్ ను విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయ్యింది. ఫిబ్రవరి నెల ఆఖరి రోజును అందుకు మూహూర్తంగా పెట్టుకున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 5 దశల్లో ఎన్నికలను పూర్తి చేయాలని ఈసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఏప్రిల్ నెలాఖరుకు మొత్తం పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇక ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వస్తే మరింత వేడెక్కడం ఖాయం.