దీపావళి రోజున 14 మంది రైతుల ఆత్మహత్య
posted on Oct 25, 2014 1:26PM

ఇది నిజంగా హృదయ విదారకమైన సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ వున్నాయి. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు. ఒక్కోరోజు ఐదారుగురు చనిపోయిన సందర్భాలు కూడా వున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 270 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క దీపావళి రోజునే 14 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ఆత్మహత్యలకు సంబంధించిన సమగ్ర సమాచారం తమ దగ్గర వుందని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇది బంగారు తెలంగాణా లేక ఆత్మహత్యల తెలంగాణా అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యలను పరిష్కరించకుండా ఇతరులను తిడుతూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.
విద్యుత్ సమస్య మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అవసరమైతే అఖిలపక్షాన్ని గవర్నర్ దగ్గరకి తీసుకెళ్ళి సమస్య పరిష్కరానికి చొరవ చూపాలని అన్నారు. మీడియా ముందు పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రయోజనం వుండదని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించి ఆత్మహత్యలు ఆపాలన్నారు. వచ్చే మూడేళ్ళపాటు కరెంటు సమస్యలు వుంటాయని చెబుతున్న కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తక్కువ ధరకు కరెంటు ఇవ్వడానికి ముందుకు వచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.