హే మ‌హేశా! బ్యాంక్ స‌ర్వ‌ర్ హ్యాక్‌.. 12 కోట్లు ఫసక్..

డబ్బెక్కడ దాచుకుంటావని అడిగితే.. ఇంకెక్కడ బ్యాంకులో.. అనేది కామన్ ఆన్స‌ర్‌. ఎందుకంటే, బ్యాంకులో డ‌బ్బు సుర‌క్షితం అనేది అంద‌రి అభిప్రాయం. క్యాష్‌ విత్‌డ్రాల‌కు లిమిట్ పెట్ట‌డం.. ఇప్పుడంతా డిజిట‌ల్ ట్రాన్జాక్ష‌న్సే అవ‌డంతో.. ఇష్టం ఉన్నా లేక‌పోయినా బ్యాంక్ అకౌంట్లోనే డ‌బ్బులు ఉంచుకోవాల్సిన ప‌రిస్థితి. అందుకే, బ్యాంకుల్లో భారీ న‌గ‌దు నిల్వ ఉంటోంది. అది క్యాష్ రూపంలో కాకుండా అక్క‌డ కూడా ఆన్‌లైన్ మ‌నీనే. అందుకే, మునుప‌టిలా బ్యాంకుల‌కు క‌న్నెం వేయ‌డం లాంటి చోరీల‌కు కాలం చెల్లింది. క‌ష్ట‌ప‌డి బ్యాంక్ గోడ‌ల‌కు రంధ్రం చేయ‌డం.. లాయ‌ర్లు ప‌గ‌ల‌గొట్టడం లాంటివి పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి టైమ్ దొంగ‌త‌నాలు. ఇప్పుడంతా ఆన్‌లైన్ దోపిడీనే. ఎక్క‌డో ఉంటారు.. ఇంకెక్క‌డి మ‌నీనో కొట్టేస్తారు. జ‌స్ట్ కంప్యూట‌ర్ క్లిక్స్‌తో స‌ర్వం దోచేస్తున్నారు. లేటెస్ట్‌గా హైద‌రాబాద్‌లోని మ‌హేశ్ కో ఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంకులో అలానే నిమిషాల వ్య‌వ‌ధిలోనే 12 కోట్లు దోచేశారు సైబ‌ర్ నేర‌గాళ్లు. అది కూడా హాలిడేస్ టైమ్‌లో.

హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్లే చేశారు సైబర్‌ నేరగాళ్లు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి, బ్యాంకు మూలధన ఖాతా నుంచి ఏకంగా  రూ.12.40 కోట్లు దోచుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఇతర బ్యాంకుల్లో ఉన్న త‌మ 120 ఖాతాలకు ఆ సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేశారు. బ్యాంకుకు సెలవు రోజులైన శని, ఆదివారాలను ఈ హ్యాకింగ్‌కు అవకాశంగా వాడుకున్నారు కేటుగాళ్లు.

రెండు రోజులు సెలవుల తర్వాత సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకుకు వ‌చ్చి ప‌ని మొద‌లుపెట్ట‌బోగా.. సర్వర్‌ పని చేయడం లేద‌ని గుర్తించారు. బ్యాంకు ఉన్నతాధికారులు వెంట‌నే సాంకేతిక సిబ్బందిని అలర్ట్‌ చేశారు. వారు రంగంలోకి దిగి పరిశీలించగా బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ హ్యాక్‌ అయినట్లు తేలింది. సాంకేతిక నిపుణులు నిమిషాల వ్యవధిలో బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ సాఫ్ట్‌వేర్‌ను సెక్యూర్డ్ చేసినప్పటికీ, అప్పటికే బ్యాంకు మూలధన ఖాతా నుంచి రూ.12.40 కోట్ల డబ్బు గల్లంతైనట్లు తేలింది. సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. 

నేర‌గాళ్లు చాలా ప‌క్కాగా సైబ‌ర్ క్రైంకు పాల్ప‌డ్డారు. బ్యాంకులో రోజు వారీగా రూ.5 కోట్లకు మించి మూలధన ఖాతా నుంచి విత్‌డ్రా చేయడానికి వీల్లేకుండా సాఫ్ట్‌వేర్ ఉంది. ఈ విషయం పసిగట్టిన హ్యాకర్లు.. బ్యాంక్ స‌ర్వ‌ర్ హ్యాక్ చేయ‌గానే.. ముందుగా 5 కోట్ల లిమిట్‌కి ఇంకో సున్నా యాడ్ చేసి.. ప‌రిమితిని 50 కోట్లకు పెంచేశారు. ఆ వెంట‌నే రూ.12.40 కోట్లను దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ 120 ఖాతాల్లోకి మళ్లించారు. అవ‌న్నీ వాళ్లు ముందే రెడీ చేసి పెట్టుకున్న బ్యాంక్ అకౌంట్లు. ఈ ఘ‌రానా దోపిడీపై సైబ‌ర్ క్రైం పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

ఘ‌ట‌న‌పై బ్యాంక్‌ ఎండీ ఉమేశ్‌ చంద్‌ అసావా స్పందించారు. డబ్బులు మళ్లించిన లావాదేవీలను గుర్తించామని.. ఆయా ఖాతాలను బ్లాక్‌ చేయించే ప్రయత్నం చేశామ‌ని చెప్పారు. 4 రాష్ట్రాల్లో, 45 శాఖలున్న మహేశ్‌ బ్యాంకు కస్టమర్లంద‌రి డబ్బు సురక్షితంగా ఉందని చెప్పారు.