లోక్ సభలో జగన్ పార్టీ ఎంపీకి కీలక పదవి

 

వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి లోక్ సభలో కీలక పదవి పొందారు. తాజాగా లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ సభకు హాజరుకాని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అలా జరగడం చాలా అరుదైన విషయం అయినా ఈ పదవి కూడా ప్రాముఖ్యత ఉన్న పదవే. కాగా రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌ రెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన విషయం తెలిసిందే.

2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక గత(16)వ లోక్‌ సభలో అప్పటి మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ రావు ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఇక ఈ టర్మ్ లో ఈ పదవి తాజాగా మిథున్‌రెడ్డిని వరించింది. ఈయన చిత్తూరు జిల్లా కీలక నేత ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుమారుడు కూడా. ఇక తంబాళ్ళపల్లె ఎమ్మెల్యే ద్వారకనాద్ రెడ్డి ఈయనకి బాబాయ్ అవుతారు.