కొరివితో తలగోక్కుంటున్న ట్రంప్?
posted on Apr 8, 2025 6:57AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరి కొరివితో తలగోక్కుంటున్నట్లుంది. ఆయన ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు సోమవారం ప్రపంచంలోని ప్రధాన సూచీల్లో ఒక్కటీ లాభాల్లో లేకుండా పోయాయి. దాదాపు 90 దేశాలపై ట్రంప్ భారీగా ప్రతీకార పన్నులు విధించడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఆసియాలోని జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్, భారత్ ప్రధాన సూచీలు మొత్తం కనీసం 3 నుంచి 10 శాతం నష్టాలను నమోదు చేశాయి.
అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత, హార్వర్డ్ లా గ్రాడ్యుయేట్ అయిన జిమ్ క్రెమెర్ ఓ అడుగు ముందుకేసి 1987 బ్లాక్ మండే మళ్లీ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించడంతో ఇన్వెస్టర్లు ఉలిక్కిపడ్డారు. ట్రంప్ తక్షణమే చర్చలకు సిద్ధంగా ఉన్న దేశాలతో చర్చలు జరిపి ప్రతీకార పన్నులను తొలగించాలని జిమ్ క్రెమెర్ కోరాడు. నిబంధనలు పాటించే కంపెనీలకు ఉపశమనం కల్పించకపోతే, ఇప్పటికే మూడు రోజులు నష్టాల్లో ఉన్నాం.. సోమవారం బ్లాక్ మండే పునరావృతం కావచ్చని ఆయన హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా 1987 అక్టోబర్ 19ని బ్లాక్ మండేగా అభివర్ణిస్తారు. ఆ ఒక్క రోజే అమెరికాలోని డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఏకంగా 22.6 శాతం పతనమైంది. మరో వైపు ఎస్అండ్పీ 500 సూచీ 30 శాతం విలువ కోల్పోయింది. ఇది అక్కడితో ఆగలేదు. ప్రపంచంలోని ఇతర మార్కెట్లపైనా దీని ప్రతికూల ప్రభావం పడింది. ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా మార్కెట్లు విలవిల్లాడిపోయాయి. ఈ మార్కెట్ల పతనం దాదాపు నెల రోజులు కొనసాగింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో 20శాతం విలువ కోల్పోయాయి.
1987 స్టాక్ మార్కెట్ పతనం ఏదోఒక కారణంతో జరిగింది కాదు. చాలా అంశాలు దీనికి తోడయ్యాయి. బ్లాక్ మండేకు ముందు వరకు బుల్ మార్కెట్ జోరు కనిపించింది. దీంతో 1982 నుంచి చూస్తే చాలా స్టాక్స్ విలువ మూడు రెట్లయ్యాయి. దీంతో అవి కరెక్షన్కు గురయ్యాయి. కంప్యూటరైజేషన్ కూడా ఆ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. అప్పట్లో ఇది ప్రాథమిక దశలోనే ఉంది. నాడు వాడిన ‘సి’ ప్రోగ్రామ్ మానవ జోక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆటోమేటిక్ కొనుగోలు, విక్రయాలు చేపట్టింది. ధరలు పెరుగుతున్నప్పుడు ఎక్కువ కొనుగోలు చేయడం, తగ్గుతున్నప్పుడు ఎక్కువ అమ్మకాలు చేపట్టడం వంటివి ఆటోమేటిక్గా జరిగాయి. దీంతో అక్టోబర్ 19న విక్రయ ఆర్డర్లు పెరగడంతో మార్కెట్ కుప్పకూలింది. మళ్లీ ఏప్రిల్ 4న శుక్రవారం నాడు అతిపెద్ద పతనాన్ని అమెరికా మార్కెట్లు చవిచూశాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల సొమ్ము ఆవిరైపోయింది.