సార్క్ సమ్మిట్ కు మేం రాం.. భారత్ కు మద్దతుగా పలు దేశాలు..
posted on Sep 28, 2016 10:44AM
ఉరీ దాడి అనంతరం భారత్-పాక్ పై బాగానే ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ భారత్ కు పక్కలో బల్లెంలా ఉంటూ.. పలు దాడులకు పాల్పడుతుంది. గతంలో పఠాన్ కోట్ పై దాడి చేసి పలువురు జవాన్లను బలి తీసుకోగా.. ఇటీవల ఉరీ సైనిక స్థావరంపై దాడి పలువురు సైనికులను బలిగొన్నారు. దీంతో భారత్-పాక్ పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంది. అందుకే పాక్ ను ఒంటరి చేయడానికి తగిన పన్నాగాలు చేస్తుంది. ఇప్పటికే పాక్ చేసిన పనికి అగ్రరాజ్యాలు సైతం ఆ దేశంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటివరకూ సింధూ జలాలపై.. పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత అనుకూల దేశం) హోదాను పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకున్న భారత్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొంది. పాకిస్థాన్ పై దౌత్యపరమైన యుద్ధానికి దిగింది. దీనిలో భాగంగానే నవంబరులో పాకిస్థాన్ లో జరగాల్సిన సార్క్ సమావేశాలకు హాజరు కాబోమని భారత్ తేల్చి చెప్పేసింది. అయితే భారత్ కు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. భారత్ కు ఇతర సభ్యదేశాలు బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్ లు బాసటగా నిలిచాయి. తాము కూడా హాజరు కాబోమని చెప్పడంతో పాకిస్థాన్ ఒంటరైపోయింది. ఈ పరిస్థితుల్లో సార్క్ సమావేశాలు వాయిదా పడే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.