లండన్‌లో 1860 కోట్ల దోపిడీ
posted on Apr 8, 2015 5:08PM
లండన్‌లో భారీ దోపిడీ జరిగింది. భారత కరెన్సీతో లెక్కవేస్తే దాదాపు 1860 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. లండన్ నగరంలోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలు పడి 1860 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, నగలను దోచుకుపోయారు. ఈస్టర్ సెలవుల కారణంగా గత మూడు రోజులుగా బ్యాంకు మూసి వుంది. ఈ ఛాన్స్‌ని లడ్డులాగా అందుకున్న దోపిడీదారులు చక్కగా వినియోగించుకుని బ్యాంకుకు గుండుకొట్టారు. బ్యాంకు పైకప్పును తొలగించి లోపలకు వెళ్ళిన దొంగలు లోపల వున్న మొత్తం 600 సేఫ్ డిపాజిట్ లాకర్లలో 300 లాకర్లను తెరిచి, వాటిలోని వజ్రాలు, నగలు, నగదును దోచుకున్నారు. లాకర్లు తెరవడానికి దొంగలు అత్యాధునిక కటింగ్ యంత్రాలను ఉపయోగించారు. బ్యాంకులోని అలారం వ్యవస్థ కూడా పనిచేయపోవడంతో ఈ ఘటన వెనుక ఇంటిదొంగల పని వుండి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.