భజరంగ్ దళ్ పెళ్లి ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో దూకిన జంట

 

ప్రేమికుల రోజు వస్తుందంటే చాలు ప్రేమికులు, యువతలో భజరంగ్ దళ్ భయం పట్టుకుంటుంది. ఎందుకంటే ఆరోజు జంటగా కనిపిస్తే చాలు బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారు. ఈ బలవంతపు పెళ్లిళ్ళను అడ్డుకోవడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడో ఓ దగ్గర భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయి పెళ్లి జరిపిస్తూనే ఉన్నారు. మొన్న ప్రేమికుల రోజున కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో కనిపించిన జంటను చూసి భజరంగ్ దళ్ కార్యకర్తలు.. ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటన తర్వాత తమ ముఖం ఇంటివాళ్లకు చూపించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆ జంట హైదరాబాద్ వదిలి వెళ్లిపోయారు. దీంతో యువతి తండ్రి భజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన తర్వాత తన కూతురు కనిపించలేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయిందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆరుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేసారు. అయితే నిన్న హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన ఆ జంట, సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పెట్రోలింగ్ పోలీసులు వాళ్లని కాపాడారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు, వాళ్లకి కౌన్సెలింగ్ ఇచ్చి పేరెంట్స్‌కి అప్పగించారు.