Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 5


    "నిజంగా అవి గోల్డెన్ డేస్ రా!"
    "ఫ్లాటినమ్"
    "మనల్ని హాస్టల్ నుంచి ప్రిన్సిపాల్ గెంటేయక పోయినట్టయితే ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం"
    "అయినా మనం రూమ్ లో కుక్కల్ని పెంచుతే ఆ వార్డెన్ కెందుకు మంట?"
    "అదే నాకు తల్చుకున్నప్పుడల్లా వళ్ళు మండేది! కుక్కలన్నాక ఇరవై నాలుగ్గంటలూ రూమ్ లో ఉండమంటే ఉంటాయా? షైరుకెళ్ళవూ?"
    "నల్ల కుక్కయినా వార్డెన్ కి కరిచేది కాదు. వాడు దానిని చూసి భయపడి పరుగెత్తుతే దానికి అనుమానం వచ్చి- "సమ్ థింగ్ రాంగ్ విత్ దిస్ ఫెలో" అనుకుని కాలుపట్టుకుంది. ఆ మాత్రానికే నానా రాద్దాంతం చేసేశాడు"
    "అక్కడికీ మనమే, మన ఖర్చుతో బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయిస్తామని ప్రామిస్ చేశాం కదా! అయినా వినిపించుకోకుండా ప్రిన్సిపాల్ కి చెప్పాడు"
    "అసలు  అది పిచ్చికుక్కని వాడి అనుమానం"
    "ఛ పాపం అప్పటికసలు పిచ్చిలేదు దానికి! ఆ తరువాతయినా మననెందుకు కరవబోయిందంటే వాడిని కరవడం మూలానా వాడి పిచ్చే దీనికి ఎక్కి ఉంటుంది. వాడు మొదటి నుంచీ క్రాకే కదా!"
    "అవునవును"
    "కానీ రూమ్ ఖాళీ చేసే రోజు మాత్రం అది మరీ కోపంగా ఉండి మన వెనకపడింది చూడు. నిజంగా మనం భలేలక్కీగా తప్పించుకున్నాం. లేకపోతే ఇద్దరినీ కరిచేది"
    "అదిప్పుడెక్కడుందో?"
    "నేను ఆ మధ్య వెళ్ళినప్పుడు చూశాను. దుర్గామహల్ దగ్గర తిరుగుతోంది. నన్ను చూసి గుర్తుపట్టింది గానీ ఏమీ తెలీనట్లు సైకిల్ స్పీడ్ గా తొక్కి తప్పించుకున్నాను"
    "పూర్ డాగ్! మంచి ఫీట్స్ చేసేది!"
    'ఒండర్ ఫుల్ ఫీట్స్! ముఖ్యంగా ఎగ్జామినేషన్ రూమ్ కిటికీలో నుంచి మనిద్దరికీ కాపీలు అందించేది. గుర్తుందా? సూపర్బ్ ఫీట్! ఓసారి ఆ సీన్ చూసి మన వాచర్లే తప్పట్లుకొట్టారు! కదూ?"
    "అవునవును!"
    "కాపోతే దానిక్కొంచెం కోపం ఎక్కువ"
    "అవును! ఆ కోపం చూసి పిచ్చి అనుకునేవాళ్ళు పిచ్చి వెధవలు!"
    "రియల్లీ మాడ్ ఫెలోస్!"
    "ఆఖరి పరీక్షనాడు పాపం అది ఎంతోకష్టపడి అందిస్తోన్న ఆఖరి కాపీ కాగితం ఆ వాచర్ గాడు లాక్కోబోయి నప్పుడే కదా ఒళ్ళుమండి వాడిచేయి పట్టుకుంది."
    "అవును! వాచర్ ఎంత తన్నుకున్నా వదిలింది కాదు. నాకు అదే తల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వాచర్ చేయి వదిలేయమని మనం చెప్పినా విన్లేదు"
    "ఒకోసారి అంతే అది! మనం చెప్పగానే వాచార్ చేయి వదిలేస్తే మనం అప్పుడే ఇంటర్ పాసయిపోయే వాళ్ళం"
    "దాని మూలాన ఒక సంవత్సరం నష్టపోయాం"
    "వాటెవర్ ఇట్ మేబి. స్టిల్ అలాంటి కుక్క అయ్ మీన్ అలాంటి ఇంటెలిజెంట్ డాగ్ మనకి దొరకడం చాలా కష్టం."
    "కష్టమే అనుకో! బట్ స్టిల్ వుయ్ కెన్ ట్రై!"
    "అంటే మళ్ళీ కుక్కని పెంచుదామంటావా?"
    "డెఫినెట్ లీ! ఎలాగూ ఇద్దరం కలసి ఉండబోతున్నాం కదా! చాలా సరదాగా ఉంటుంది. దానికి అన్నీ నేర్పడం, దాన్తోనే బోలెడు పనులు కూడా చేయించుకోవచ్చు. పాన్ దుకాన్ నుంచి సిగరెట్లు, కిళ్ళీలు తెప్పించుకోవడం, పుస్తకాలు సర్దించడం"
    "ఓకే అయితే వెతుకుదాం. మాంచి బ్రీడ్ కోసం"
    "అబ్బే వెతకక్కర్లేదు. నా దృష్టిలో ఒక కుక్క వుంది"
    "ఎక్కడ?" ఆశ్చర్యంతో అడిగాడు చిరంజీవి.
    "నా రూమ్ కెదురుగా వున్న ఎలక్ట్రిక్ పోల్ పక్కనే కూర్చుని వుంటుంది. వైట్ బాడీ బ్లాక్ ఫేస్".
    "ఐసీ"
    "వెరీగుడ్ డాగ్ రూమ్ లో దిగినరోజే కనిపెట్టాను. నేను చూస్తుండగానే ఎవరో సైకిల్ కి సంచీ తగిలించుకుని నడిచి వెళ్తోంటే ఒక్క ఎగురెగిరి సంచీలో పైకి కనబడుతున్న రొట్టె ఎత్తుకుపోయింది."
    "వెరీ డేరింగ్ కదూ?"
    "మనం కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు! ఫర్ ఫెక్ట్ గా తయారవుతుంది. ఎందుకయినా మంచిదని దానికి నేను నిన్నే బిస్కెట్లు కొనిపెట్టాను. అప్పటినుంచి గది చుట్టూ తిరుగుతోంది."
    "వెరీగుడ్" సంతృప్తిగా అన్నాడు చిరంజీవి.
    "ఇంకా నేను వెళ్ళనామరి? ఇప్పటికే అరగంట ఆలస్యం అయిపోయింది ఆఫీస్ కి!" అన్నాడు సింహాద్రి టైమ్ చూసుకుంటూ.
    "ఓకే! అన్నట్లు నీ రూమ్ అడ్రసేమిటి?"
    "అడ్రసేముందిరా! కనుక్కోవడం చాలా తేలిక! మలక్ పేట్ కు వచ్చేసెయ్. అక్కడ శవం బ్రదర్స్ బ్రాందీ షాప్ కెదురుగ్గా.."
    "శవం బ్రదర్సా?"
    "ఓసారి శవం బ్రదర్స్ కాదు. శివం బ్రదర్స్."
    "శవం బ్రదర్స్ అంటావేమిటి?"
    "అది పెయింటర్ తప్పని హోటల్ మేనేజర్ చెప్పాడ్లే! పెయింటర్ పేరు తంగవేలు అనీ చకున్ చికేరి జాతి!"
    "చకున్ చికేరియా?"
    "యస్! చకున్ చికేరేయో, లేక కచిన్ పరాచీయో పచిన్ కరాచీయో ఏదో సరిగ్గా గుర్తులేదు. అతనికి తెలుగు రాదు కదా! వాళ్ళు సికింద్రాబాద్ లో వెరీ ఫేమస్. కనుక నువ్వెప్పుడయినా బ్రాందీషాపు పెడితే సికింద్రాబాదుని గుర్తుంచుకుని బోర్డు రాయించేటప్పుడు ఎవైడ్ చేసెయ్"
    "డెఫినెట్ లీ! ఇంతకూ ఆ శవం బ్రదర్స్ బ్రాందీషాపు కెంతదూరంలో వుంటుంది రూమ్?"
    "శవం కాదు! శివం బ్రదర్స్ అనాలి! ఆ బ్రాందీషాపు కెదురుగ్గా సందులో వందమీటర్లు కొలచినాడు! అంతే ఎదురుగ్గా ఆకుపచ్చ బిల్డింగ్! రోడ్ మీదకే రూమ్. ఎదురుగ్గా ఎలక్ట్రిక్ పోల్. దానికింద కుక్క వైట్ బాడీ, బ్లాక్ కలర్ మొఖం"
    "ఇంటి నెంబర్?"
    "ఇంటి నంబరా? 6-6-3-2-8-1-3-1-629/369-ఓ-ఎస్-కె-ఎన్-సి-బి-29బార్.."
    చిరంజీవి కంగారుపడ్డాడు.
    "అది ఇంటినంబరా?"
    "ఇంకా రెండు అంకెలు చెప్తే పూర్తి అవుతుంది!"
    "అదేదో కోడ్ నంబర్ లాగుందేమిటి? ఇంటినెంబర్లా లేదు."
    "కాదు! ఇంటినెంబరేనని చాలామంది చెప్పారు"
    "ఎవరువాళ్ళు?"
    "చుట్టుపక్కవాళ్ళు అదీగాక అదంతా ఇంటిగోడమీద కూడ రాసి వుంది!"
    "సాధారణంగా బ్యాంకుల్లో స్ట్రాంగ్ రూమ్ ల తాళం చేతుల కాంబినేషన్ నెంబర్లు ఇలా వుంటాయని ఎక్కడో చదివాను"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS