Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 4


    "అఫ్ కోర్స్! అది నిజమేననుకో! కానీ అప్పుడు ఫెయిలవటానికి కారణం ఉంది"
    "ఏమిటది?"
    "ఇవేవీ అవసరం లేకుండానే బీఏ పాస్ సర్టిఫికెట్లు ఒకచోట అమ్ముతున్నారని తెలిసి అక్కడికెళ్ళాను. మన ఆంధ్రప్రదేశ్ లో ఆ సౌకర్యాలు చాలా ఏర్పాటుచేశారుగా! మార్కులు కొనుక్కోవడం దొంగ బస్ పాస్ లు కొనుక్కోవడం, డిగ్రీ సర్టిఫికెట్లు కొనుక్కోవడం...."
    "అయితే మరా బీఏ సర్టిఫికెట్ కొన్నావా?"
    "కొంచెం లో మిస్సయింది!"
    "ఎలా?"
    "పాపం ఆ సర్టిఫికెట్లమ్మేవాడికి హఠాత్తుగా ఏదో జబ్బు వచ్చిందట. అందుకని అమెరికా వెళ్ళిపోయాడు. దాంతో ట్రబులయిపోయింది. ఇలా లాభంలేదని ఇంటర్ పరీక్ష పేపర్లే కొని ఆ తరువాత సంవత్సరం పాసయ్యాను."
    "ఇంతకూ నువ్ చేసే ఉద్యోగం ఏమిటి?"
    "అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్"
    సింహాద్రి ఉలిక్కిపడ్డాడు.
    "ఆ వుద్యోగం ఇచ్చారా నీకు?"
    "బతిమాలి ఇచ్చారు!"
    "ఎందుకు?"
    "సాధారణంగా అందరూ ఆ వుద్యోగం అంటే పారిపోతూంటారు, అందుకని మనలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇస్తారన్నమాట!"
    "అంటే అది రైళ్ళు నడపడంతో సంబంధం వున్న ఉద్యోగం కదూ?"
    "అవును"
    "అయితే మొన్న ఇక్కడికి దగ్గర్లో జరిగిన రైలు యాక్సిడెంట్ నీ పనేనా?" అనుమానంగా అడిగాడు సింహాద్రి.
    "ఛ! కాదు!"
    "ఒట్టు అను!"
    "ఒట్టు"
    "అయితే మరెవరు చేశారు?"
    "అదింకా తెలీదు. ఇంజనీరింగ్ వాళ్ళ ఫాల్ట్ అని కారేజ్ వాగన్ డిపార్ట్ మెంట్ వాళ్ళు- కాదు కారేజ్ వాగన్ వాళ్ళదే అని ఇంజనీరింగ్ వాళ్ళు వాదించుకుంటున్నారు. అది తేలాలంటే ఇంకో ఆర్నెల్లు పడుతుందిలే!"
    "ఓహో" అసంతృప్తిగానే అన్నాడు సింహాద్రి.
    "అయితే ఓ పనిచెయ్! మన సీనియర్ రత్నారావ్ గాడు ఇక్కడే వున్నాడు. వాడెప్పుడయినా కనబడితే నువ్వు చేస్తున్న ఉద్యోగం సంగతి వాడికి ఛస్తే చెప్పకు!"
    "ఎందుకని?"
    "మొన్న జరిగిన రైలు ప్రమాదంలో వాడి ప్రియురాలి మొఖం కాస్తా పద్దెనిమిది గాయాలతో అందవికారంగా తయారయిందట. అప్పటినుంచీ కనబడ్డ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నల్లా పొడుస్తానని కత్తి తీసుకు తిరుగుతున్నాడు."
    "కానీ దానికి బాధ్యత 'ఎఎస్సెమ్'ది కాదు గదా!"
    "వాడదేమీ వినిపించుకోవటం లేదు. వాడికెవడో చెప్పాడట- రైలు ప్రమాదాలకు ముఖ్య కారణం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లని!"
    "చెప్పినవాడెవడో పెద్ద ఇడియట్ అంటాను"
    "కానీ రత్నారావ్ గాడు మాత్రం అలా అనుకోవటం లేదు"
    "పూర్ ఫెలో!"
    "ఏదేమయినా నువ్వు మాత్రం వాడు కనబడితే నువ్ చేసే ఉద్యోగం గురించి చెప్పకు"
    "ఛస్తే చెప్పను!"
    "మరేమని చెప్తావ్?"
    "ఆర్టీసీలో డ్రయివర్ నని చెప్తాను"
    "వద్దు! అది కూడా వాడికిష్టం లేదు"
    "ఎందుకు?"
    "వాడు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ఓసారి రోడ్డుమీద కెడితే ఆర్టీసీ బస్సొకటి దానిమీద నుంచి వెళ్ళిపోయిందట!"
    "వెరీ బాడ్!"
    "అవును పాపం అప్పటినుంచీ వాడు ఆర్టీసీ డ్రయివర్ల మీద కూడా కోపంగా ఉన్నాడు!"
    "అయితే ఇంకేం చెప్పను?"
    "ఏదోవోటి చెప్పు- ఆ రెండూ తప్పించి"
    "ఓకే! ఏదో డిస్పెన్సరీలో కాంపౌండర్ నని చెప్తాను."
    "నన్నడిగితే అదీ మంచిది కాదు"
    "అయితే మరేం చెప్పమంటావ్?"
    "ఏదో కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్ అను"
    "ఓకే! ఎగ్రీడ్"
    ఇద్దరూ 'టీ' తాగేశారు.
    "ఇంతకూ నువ్వేం చేస్తున్నావిక్కడ?" అడిగాడు చిరంజీవి.
    "ఉద్యోగం"
    "పాపం- నువ్ చేసేది ప్రైవేట్ కంపెనీయా, గవర్నమెంటా?" జాలిగా అడిగాడు చిరంజీవి.
    "ప్రైవేట్ కంపెనీయే"
    "గవర్నమెంట్ అయితే మనం ఇంత జాలిపడాల్సిన పరిస్థితి ఉండేది కాదు"
    "అవును!"
    "వాళ్ళనంత బలవంతం చేసిన రికమండేషన్ ఎవరిది?"
    "మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ది"
    "ఏమిటంత ప్రేమ మీ మామయ్యకు"
    "ప్రేమ కాదు... గుడ్డూ కాదు"
    "మరి?"
    "అదొక పెద్ద కథ! తరువాత చెప్తాలే గానీ- ఇంతకూ నీ మకాం ఎక్కడ?" అడిగాడు సింహాద్రి.
    "కేరాఫ్ రైల్వే ఫ్లాట్ ఫారం!"
    "అదేమిటి?"
    "క్వార్టర్స్ దొరకలేదురా మరి! ఇంకేం చేస్తాను?"
    "ఆల్ రైట్ అయితే ఓ పనిచెయ్"
    "ఏమిటో చెప్పు?"
    "రేపే నా రూమ్ కొచ్చేసెయ్"
    చిరంజీవి ఆనందంతో పొంగిపోయాడు.
    "అయితే మళ్ళీ పాతరోజులు తిరిగి వచ్చేశాయన్నమాట"
    "నిస్సందేహంగా"
    "కాలేజీ హాస్టల్లోలాగా గడపొచ్చు"
    "దాని బాబులాగా!"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS