Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 5


    "మీదే కాలనీ?"
    "నిర్భయ్ నగర్ కాలనీ!"
    "నిర్భయ్ నగర్ కాలనీయా?" ఇంకా చిరాకుగా అన్నాడతను.
    "అవును."
    "మరి ఇక్కడికెందుకొచ్చారు?"
    "ఇంకెక్కడికెళ్ళాలి! రిపోర్టివ్వాల్సింది పోలీస్ స్టేషన్ లోనేగా?"
    "పోలీస్ స్టేషన్ లో కాకపోతే మంగలిషాపులో ఇస్తారేమిటి? నేననేది అదికాదయ్యా! ఇది మీ ఏరియా పోలీస్ స్టేషన్ కాదు."
    "మరి మా ఏరియా పోలీస్ స్టేషనెక్కడుంది?"
    "ఆ రోడ్డు చివర ఉంది."
    "అంతదూరం వెళ్ళాలా ఇప్పుడు?"
    "రిపోర్టివ్వాలంటే-"
    అనేసి మళ్ళీ నిద్రకోసం వెనక్కువాలాడతను.
    "ఇంకిప్పుడెందుకులే రిపోర్టివ్వటం! పొద్దున్నవెళదాం!" అన్నాడు రాజేశ్వర్రావ్.
    "అవును ఎలాగూ దొంగలీ పాటికి మరో రెండు మూడు ఇళ్ళు కూడా చూసుకుని వాళ్ళిల్లు చేరుకొని ఉంటారు" అన్నాడు రంగారెడ్డి.
    నలుగురూ మళ్ళీ కాలనీకి చేరుకున్నారు. అప్పటికే కాలనీ అంతా నిశ్శబ్దం అయిపోయింది. అందరూ నిద్రపోయినట్లున్నారు. వాళ్ళను చూడగానే కుక్కలు హఠాత్తుగా నాలుగువేపుల నుంచి వచ్చి మొరగసాగాయి. కుక్క అరుపులు వినగానే వాలంటీర్ పార్టీ వాళ్ళు కర్రలు తీసుకుని పెద్దగా కేకలు వేసుకుంటూ పరుగుతో వచ్చారు. మరుక్షణంలో అందరిళ్ళల్లోనూ లైట్లు వెలిగిపోయినయ్. క్షణాల్లో కాలనీ వాళ్ళందరూ వాళ్ళచుట్టూ మూగిపోయారు.
    "ఇందాక వచ్చిన దొంగలేనా?" అన్నాడు మార్తండరావ్. వాళ్ళ మొఖాల మీద టార్చ్ లైటు వేస్తూ.
    శాయీరామ్ కి వళ్ళు మండిపోయింది.
    "సిగ్గులేకపోతేసరి! నిజంగా దొంగలొచ్చి దోచుకుపోయినపుడు ఒక్కడూ దిక్కులేడు గానీ ఇప్పుడు భూమి ఈనినట్లువచ్చేశారు" అన్నాడు చిరాకుగా.
    "అవును, కుక్కలూ అంతేగా" తాపీగా అన్నాడు రంగారెడ్డి.
    "మీ రిద్దరూ స్కూటర్ మీద వెళ్ళి మన ఏరియా పోలీస్ స్టేషన్ లో రిపోర్టిచ్చిరండి. నేనూ, రంగారెడ్డి వెళ్ళి మా పేపర్లో ఈ వార్త ఎక్కించేసి వస్తాం" అన్నాడు గోపాల్రావ్.
    "ఏమని రాస్తావు న్యూస్?" ఎవరో అడిగాడతనిని సంబరంగా.
    నిర్భయ్ నగర్ లో భయంకరమైన డెకాయిటీ! ఇంటి యజమాని శాయీరామ్ తో ఢీ! పదకొండువేల ఆస్థి రా! చేతికి కత్తిపోట్లు - పోలీసువారి నిర్లక్ష్యం ఇదంతా మెయిన్ హెడ్డింగ్ అన్నమాట. కింద నాలుగు పేరాలు వివరాలు రాస్తాను."
    "అబ్బ ఒండర్ ఫుల్ -" అన్నాడు రాజేశ్వర్రావ్. మర్నాడు ఉదయం ఆరుగంటలకల్లా న్యూస్ పేపర్ కొని కాలనీ వాళ్ళంతా తమ కాలనీ దొంగతనం వార్త ఉత్సాహంగా చదువుకోసాగారు. మరికాసేపట్లో పోలీస్ వానూ, జీపూ వచ్చేసినయ్ అక్కడకు.
    అందులోనుంచి బిలబిలమంటూ పోలీసులు, పోలీసుకుక్కలు, పోలీస్ అధికారులు, ఓ ఫోటోగ్రాఫరూ దిగి శాయీ రామ్ ఇంట్లోకి వెళ్ళారు కాలనీవాళ్ళంతా శాయీరామ్ ఇంటిముందు మూగిపోయి ఉత్సాహంగా చోద్యం చూడసాగారు. కుక్కలు దొంగల వాసన గుర్తెట్టుకుని వాళ్ళను పట్టుకోడానికి బయటికొచ్చాయ్. అందరూ వాటి వెనకే బయల్దేరారు. అవి కాలనీ చుట్టూ రెండు రౌండ్లు తిరిగి గోపాల్రావ్ ఇంట్లోదూరి మొరగసాగాయ్!
    "అదేమిటి? అతన్ని చూసి మొరుగుతాయ్?" అడిగారు జనం.
    "మీరెవరు?" అన్నాడు పోలీస్ అధికారి గోపాల్రావ్ ని చూసి.
    "జర్నలిస్టు గోపాల్రావ్ ఇతనేనండీ! ఈ దొంగతనం గురించి ఇవాళ పేపర్లో రాసింది ఇతనే" పరిచయం చేశాడు శాయీరామ్.
    "ఓహో" అనుమానంగా తలపంకించాడతను.
    "అయితే పోలీస్ స్టేషనుకి పదండి."
    గోపాల్రావ్ అదిరిపడ్డాడు. "పోలీస్ స్టేషనుకా? ఎందుకు?"
    "మిమ్మల్ని ప్రశ్నించాల్సివుంది."
    ఈలోగా కుక్కలు మళ్ళీ జుయ్ మంటూ పరుగెత్తి వెంకట్రావ్ ఇంట్లో దూరాయ్. అది చూసి వెంకట్రావ్ కి చలిజ్వరం వచ్చేసింది. "ఇదేం అన్యాయం సార్! చిన్నప్పటి నుంచీ పూచిక పుల్ల కూడా ముట్టుకొని ఎరగను." అన్నాడు ఏడుపు మొఖంతో.
    కుక్కలు అక్కడనుంచి గుంపులో నిలబడ్డ యాదగిరిని చూసి మొరగటం ప్రారంభించేసరికి పోలీస్  అధికారికి చిరాకేసుకొచ్చింది.
    "అంటే మేమందరం దొంగలమేనంటారా?" అడిగాడు యాదగిరి.
    అందరూ ఘొల్లున నవ్వారు.
    "ఇంక వీటిని తీసుకుపోండి" అన్నాడు ఇన్స్ పెక్టర్.
    కుక్కలు మళ్ళీ వాన్ ఎక్కి వెళ్ళిపోయాయి.
    కాలనీ వాళ్ళంతా పోలీస్ అధికార్ల చుట్టూ మూగారు.
    "ఇలా విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతూంటే మీరేం చేస్తున్నట్లు? "అందరి తరపునా వకాల్తాపుచ్చుకున్నట్లు అడిగాడు గోపాల్రావ్.
    పోలీస్ అధికారికి వళ్ళు మండిపోయింది.
    "నువ్వెవరివి?"
    "జర్నలిస్టుని?"
    "ఓహో- అయితే పోలీసు  డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందో అదివరకు మీ పేపర్లు రాయలేదా?"
    "రాశాం!"
    "రాస్తే మళ్ళీ అడుగుతారేం?"
    "డెకాయిటీలు ఎక్కువయిపోయాయి కాబట్టి!"
    "డెకాయిటీలు ఎక్కువవ్వలేదు" కోపంగా అన్నాడు పోలీసు అధికారి.
    "అబద్దం" అరిచాడు గోపాల్రావ్.
    "అవును అబద్దం" అన్నారు, అందరూ వత్తాసుగా.
    "అబద్దం ఏమీలేదు."
    "అయితే మరి డెకాయిటీ రోజుకోటి జరుగుతోంటే లేదంటారేమిటి?"
    పోలీసు అధికారి తల రెండు చేతుల్లో పట్టుకున్నాడు.
    "అబ్బా! అవి దొంగతనాలు! అంటే వాటిని 'రాబరీ' అంటారు! డెకాయిటీలు వేరు."
    "రెండూ ఒక్కటేగా? ఏరాయి అయినా మా పళ్ళేగా వూడేది?" ఎవరో  అరిచారు.
    "కాదయ్యాబాబు! రెండూ వేరు" విసుక్కున్నాడతను.
    "ఏమిటో  ఆ  తేడా?"
    "నలుగురుగానీ - ఇంకా తక్కువగానీ దొంగలు వస్తే అదిరాబరీ. అయిదుగురుగానీ, ఇంకా ఎక్కువగానీ  వస్తే అది డెకాయిటీ-"
    "అయితే ఇప్పుడు శాయీరామ్ గారింట్లో జరిగింది డెకాయిటీ కాదంటారు?"
    "మేము దాన్ని 'రాబరీ' కేటగిరీలో వేసుకుంటాం!"
    "మీరు దేనికిందేసుకుంటే మాకెందుకండీ ఇప్పుడీ దోపిడీ...."
    "ఇది దోపిడీ కాదన్నానా, దొంగతనం అను! ఆ!"
    "అబ్బా  ఏదొకటిలెండి సార్!"
    "అలా వీల్లేదు దేనికదే మీ యిష్టం వచ్చినట్లు మీరు పేర్లు పెడితే ఎలా? ప్రతి దానికీ - ఓ పేరూ, ఓ మెయిన్ హెడ్డు, ఓ ప్రొసీజరూ ఉంటాయ్."
    "అయితే యిప్పుడేమంటారు?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS