Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 4


    "హలో!" అన్నాడు అవతలి వ్యక్తి.
  "హలో! నేను జర్నలిస్టు గోపాల్రావుని మాట్లాడుతున్నానండీ! నిర్భయ్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానన్నమాటండీ! సంగతేమిటంటే శాయీరామ్ ఇంట్లో దొంగలు పడ్డారండీ. ఇప్పుడే సూట్ కేసులతో సహా నాగార్జునసాగర్ రోడ్డు వేపు వెళ్ళారండీ. వాళ్ళు మొత్తం నలుగురు - నలుగురు చేతుల్లో నాలుగు కత్తులు - ఇవే వాళ్ళ ఆనవాళ్ళు. సొమ్ములన్నీ తీసుకొని వాళ్ళ సూట్ కేసులలో పెట్టుకొని పోయారండీ - చాలాండీ ఇంకేమయినా వివరాలు కావాలా?" గుక్కతిప్పకుండా మాట్లాడడం చేత ఆయాసపడసాగాడు గోపాల్రావు. అందరూ అతనివేపు అభినందన పూర్వకంగా చూశారు.
    "ఫుల్ డిటెయిల్స్ - బట్ క్రిస్ప్! ఎంత చక్కగా ఇచ్చాడండి వివరాలు!" మెచ్చుకోలుగా అన్నాడు రాజేశ్వర్రావ్.
    "అతనెప్పుడూ అంతేనండీ! జర్నలిస్టు కదా! టు ది పాయింట్ - మాట్లాడతాడు! అంతే!" ఇంకెవరో పొగిడారు.
    "హలో" అన్నాడు గోపాలరావ్ పొంగిపోతూ మళ్ళీ.
    "హలో" అంది అవతలి గొంతు.
    "నేను చెప్పినవన్నీ నోట్ చేసుకున్నారా? ఏమిటి? నేనా? నేను ప్రముఖ జర్నలిస్టు గోపాల్రావ్ ని"
    "..........."
    గోపాల్రావ్ మొఖం పాలిపోయింది.
    "ఆ! ఏమిటి? మీరు మాట్లాడుతోంది కంట్రోల్ రూమ్ నుంచి కాదా? మరెక్కడినుంచి? "మీ ఇంట్లోనా దొంగలుపడ్డారా? గంటసేపటి నుంచీ మీరూ కంట్రోల్ రూమ్ కోసం ప్రయత్నిస్తున్నారా? మరా సంగతి ముందే చెప్పరే. అనవసరంగా సంబరపడ్డాను - కంట్రోల్ రూమ్ దొరికిందని" ఫోన్ పెట్టేశాడతను చిరాగ్గా.
    అంతా మళ్ళీ నిరుత్సాహపడిపోయారు.
    "ఇలా కంట్రోల్ రూమ్ కోసం కూర్చుంటే పుణ్యకాలం కాస్తాపూర్తయిపోతుంది. త్వరగా పోలీస్ స్టేషన్ కు వెళ్దాం పదండి" అన్నాడు వెంకట్రావ్.
    "అవును పదండి!"
    "అందరూ ఎందుకులెండి! ముందు నలుగురు వెళ్తే సరిపోతుంది. అందరం వెళ్ళామంటే మళ్ళీ దొంగల బాస్ వచ్చి అన్ని ఇళ్ళూ ఊడ్చుకుపోతారు" అన్నాడు రంగారెడ్డి.
    "గోపాల్రావ్ ని తీసుకెళ్ళండి. జర్నలిస్టు అంటే కొంచెం త్వరగా యాక్షన్ తీసుకుంటారు" అన్నారెవరో.
    గోపాల్రావ్, శాయీ రామ్, వెంకట్రావ్, రంగారెడ్డి కలిసి పోలీస్ స్టేషన్ కి బయల్దేరారు.
    "ఎవరది?" అంతదూరంలో ఉండగానే అరిచాడు సెంట్రి.
    "నిర్భయ్ నగర్ కాలనీవాళ్ళం" అన్నాడు గోపాల్రావ్.
    "ఏం కావాలి?"
    "మా కాలనీలో దొంగతనం జరిగింది. కంప్లయింట్ ఇవ్వాలి."
    "అదుగో - ఆయనతో చెప్పండి!" అన్నాడు లోపల కుర్చీలో నిద్రపోతున్నతనిని చూపుతూ.
    అందరూ లోపలికెళ్ళి అయిదు నిమిషాల పాటు తంటాలుపడి అతనిని లేపారు. తన నిద్రకలాభంగం కలిగించినందుకు అతనికి కోపం వచ్చింది.
    "ఏం కావాలి?" అడిగాడు చిరాకుగా.
    "దొంగతనం జరిగింది."
    "ఎక్కడా?"
    "శాయీరామ్ గారింట్లో"
    "ఏ శాయీరామ్?"
    "కె.యల్. శాయీరామ్."
    "నేనడిగేది అదికాదు - ఎవడా శాయీరామ్"
    "నేనే" అన్నాడు శాయీరామ్ ముందుకొచ్చి.
    "ఆ! ఏం జరిగింది?"
    "దొంగలు వచ్చి కర్ర చూపించి నగలూ, డబ్బూ ఇంకా ఇతర వస్తువులు ఎత్తుకు పోయారండీ."
    "ఎంతమంది ఉన్నారు వాళ్ళు?"
    "నలుగురండీ"
    "ఎలా వున్నారు?"
    "నల్లగా - పొడుగ్గా ఉన్నారండి."
    "వాళ్ళను ఇంతకు ముందెక్కడయినా చూసినగుర్తుందా?"
    "లేదండీ."
    "నీ పేరేమిటి?"
    "శాయీ రామ్ అండీ."
    "ఏ శాయీ రామ్?"
    "కె.యల్. శాయీ రామ్-"
    "మీ అయ్య పేరేంది?"
    "మా ఫాదర్ పేరా?"
    "అవును."
    "ఆయన పేరెందుకు?"
    "కావాల్నయ్యా."
    "శంభులింగం."
    "ఏ శంభులింగం?"
    "కె.యల్ శంభులింగం"
    "నీ తాత పేరు?"
    "నా తాత పేరు కూడా కావాలా?"
    "కావాల్నయ్యా."
    "బసవరాజు."
    "ఏ బసవరాజు."
    "కె యల్ బసవరాజు."
    "దొంగతనం ఎన్ని గంటలకు జరిగింది?"
    "రెండు గంటలకు".
    "తలుపులు తెరిచి ఉంచావా నువ్వు."
    "నేనెందుకు తెరుస్తాను"
    "మరెలా వచ్చిన్రువాళ్ళు?"
    "తలుపులు పగల గొట్టుకొని వచ్చారు."
    "అంతవరకూ నువ్వెందుకు లొల్లిపెట్టలేదు?"
    "పెట్టేంత టైముంటే ఈ గొడవంతా ఎందుకొస్తుంది?"
    "ఆళ్ళనింకెవరయినా చూసినోళ్ళున్నారా?"
    "నైట్ వాలంటీర్ పార్టీవాళ్ళుచూశారు-"
    "ఎవరాళ్ళు?"
    "శ్రీధరం, రత్నాకరం, కిషోర్, రాజేష్"
    "వాళ్ళంతా నమ్మదగినవాళ్ళేనా?"
    శాయీరామ్ ఉలిక్కిపడ్డాడు. "అదేంటండీ? వాళ్ళు మా కాలనీ వాళ్ళేగా?"
    "కాలనీ ఏమిటయ్యా! ఇంట్లో సొంతమనుషులే మర్డర్లు చేస్తున్రు - ఇయ్యాల్రేపు."
    "అబ్బే! వాళ్ళంతా నమ్మకస్తులే!"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS