Previous Page Next Page 


    "ఓ మైగాడ్! మార్చేపోయాను. ఐ  మస్ట్ సీ హర్ నౌ"
    నర్స్  ముసి ముసిగా  నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నర్స్  నవ్వు కోవడం చూసిన డాక్టర్  ముఖం ఎర్రబడింది.
    "చూడండి  పిచ్చయ్యగారూ! రేపు  మీ అల్లుడ్ని తీసుకొచ్చి  జాయిన్  చెయ్యండి" అని  బాయ్!" అని కేక పెట్టాడు.
    "సార్!"
    "తర్వాత నంబరు పిలుపు" డాక్టర్  హడావిడి పడిపోతూ అన్నాడు.
    అయ్యా  డాక్టరుగారూ!"
    డాక్టర్___పిచ్చయ్యకేసి అసహనంగా చూశాడు.
     "ఇంతకూ మా అల్లుడి పిచ్చేనంటారా?"
    డాక్టర్  ఉదయచంద్ర విస్మయంగా పిచ్చయ్య ముఖంలోకి ఓ క్షణం  చూశాడు.
    "మీకెందుకొచ్చిందా అనుమానం?"
    "డబ్బుకోసం  నాటకం  ఆడుతున్నాడనుకొటుంన్నాను. వచ్చిన  నష్టమంతా  నేనే  భరించి  అతడి  డబ్బు  అతడికిచ్చేస్తే  ఏ పిచ్చీ వుండదును కుంటున్నాను."
     "మరి ఆ పని  చెయ్యకూడదూ ?" పిచ్చయ్య  ముఖంలోకి చురుగ్గా  చూశాడు  డాక్టరు.
    పిచ్చయ్య  గతుక్కుమన్నాడు.
    "అయ్యా డాక్టరుబాబూ! నాకు పెళ్ళికావాల్సిన ఆడపిల్లలు ఇంకా ముగ్గురు వున్నారు."
    "ఇంకేం ? కట్నం  డబ్బుకింద  వ్యాపారంలో భాగం  ఇస్తానని  చెప్పండి. ఆ తర్వాత  వ్యాపారంలో నష్టం  వచ్చిందని చెప్పండి."
     "ఇంకానా? బుద్ధిచ్చింది. అయినా డాక్టరుగారూ  మీ ధోరణి  చూస్తుంటే  నేనేదో మా అల్లుడికి అన్యాయం  చేసినట్టూ అందుకే  అతడికి పిచ్చెక్కినట్టూ వుంది. మీరు ఆ పిచ్చాడి  మాటలు  విని...."
     "సరి! సరి! ఇక ముందైనా కట్నం  తీసుకొని వాళ్ళను చూసి పెళ్ళి చెయ్యండి."
    " ఈ రోజుల్లో అసలు కట్నం  తీసుకోకుండా పెళ్ళిచేసుకునే పిచ్చోళ్ళేవరుంటారు బాబూ?'
    "అయితే ఓ పని చెయ్యండి."
    "చెప్పండి దక్తరుబాబూ!" ఉత్సాహంగా  అడిగాడు పిచ్చయ్య.
    "కట్నం ఆశ చూపించి పెళ్ళిచేసి ఆ తర్వాత వాళ్ళను పిచ్చి వాళ్ళను చేసెయ్యండి."
    డాక్టరు ఉదయచంద్ర కంఠం తీవ్రంగా  పలికింది.
    "డాక్టరుగారూ......"
    "ఏం  పెద్దమనిషివయ్యా? కన్నబిడ్డ భవిష్యత్తుకూడా నీకు  పట్టినట్టు లేదు. క్రిందటేడు లంక  పుగాకు  వ్యాపారంలో  నష్టం  రావడం ఏమిటి? ఆ వ్యాపారం  చేసినవాళ్ళంతా నిరుడు రెండు చేతులా  ఆర్జించారు. నీకొక్కడికే నష్టం వచ్చిందా?"
    పిచ్చయ్య గాభరా పడిపోయాడు.
    "డాక్టరుగారూ ! నేను  ఒక బుద్ధితక్కువ పనిచేశాను. పొగాకులో వచ్చిన  డబ్బంతా  ఆ వ్యాపారంలో పెట్టాను. చెప్పుకుంటే సిగ్గుచేటు....."
    "ఏమిటా  వ్యాపారం?"
    "చౌకగా వచ్చిందని బంగారం  కొనుగోలు చేశాను."
    "దొంగ  బంగారమా? స్మగుల్ద్!"
    "కాదు."
    "మరి?"
    "మాయ బంగారం."
    "అంటే?"
    "అవి  అచ్చం బంగారం బిస్కత్తుల్లాగే వున్నాయ్. కాని మోసపోయాను. అది అసలు  బంగారమే కాదు."
    "ఊ  చెప్పండి. ఆగిపోయారేం?"
    "ఆ దెబ్బతో కరువు తీరిపోతుందనుకొన్నానే కాని  అంత దెబ్బ తింటానని కల్లోకూడా  అనుకోలేదు డాక్టరుగారూ! ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయొచ్చని ఆశపడ్డాను. కాని అల్లుడి  కట్నం  డబ్బు కూడా చెయ్యి  జారిపోతుందనుకోలేదు. మీరే  కాపాడాలి. మా వియ్యంకుడికిగాని మా అల్లుడిక్కానీ ఈ విషయం  చెప్పకండి డాక్టరుగారు!" పిచ్చయ్య గబుక్కున డాక్టరు చేతులు పట్టుకున్నాడు.
    " ఏమిటిది....వదులు...."
    "ఇవి చేతులు కావు..... కాళ్ళనుకోండి డాక్టరుగారూ!"
    మీ అల్లుడికి ఈ బంగారం వ్యాపారం గురించి తెలియదంటారా? మరి......." ఆగి పిచ్చయ్య ముఖంలోకి చూశాడు.
    "తెలియదండీ."
    "మరి తన గోల్డు మెడల్ మీ అమ్మాయి  దగ్గర్నుంచి  మీరు  కొట్టేశారంటున్నాడు? పైగా ఆగోల్డు మెడల్   అమ్ముకొని నువ్వు  పుగాకు కొన్నావని  కూడా అంటున్నాడు....."
    "అదంతా పిచ్చివాగుడు బాబూ! కావాలని  వాగుతున్నాడనుకొన్నాను. మీరు పిచ్చే  అంటున్నారుగా? అతడి మెడల్ ని అమ్ముకొని పుగాకు కొనడం ఏమిటండి  డాక్టరుగారూ!"
    డాక్టర్ ఆలోచనలో పడ్డాడు.
    "డాక్టర్ బాబూ!"
    "ఏమిటి?"
    "నిజంగా పిచ్చే అయితే అంత అభాండం  నా నెత్తిమీద ఎందుకేస్తాడు? నా గోల్డు  మెడల్ అంటూ నా ప్రాణం  కోరుక్కుతింటున్నాడంటే నమ్మండి."
    "మీరు  అల్లుడి  భాగంగా  పుగాకు  వ్యాపారం చూపించారు. ఆ భాగం  విలువ  కొన్ని  లక్షలు  చెప్పి నమ్మించి  వుంటారు. ఆ తర్వాత వ్యాపారంలో నష్టం  వచ్చిందన్నారు. అయితే పుగాకు  వ్యాపారంలో  నష్టం రావడానికి వీల్లేదని అతడికి తెలుసు. పుగాకు వ్యాపారం అనేది అతడి సబ్ కావ్ క్షన్ మైండ్ వుండిపోయింది."
    "మరి గోల్డు మెడలంటాడేం?" మధ్యలో అందుకొని  అడిగాడు పిచ్చయ్య.
    "మీరు దొంగ బంగారం వ్యాపారం చేశారని  అతడికి తెలియదనుకుంటున్నారు. కాని అతడు ఎలాగో పసిగొట్టి  వుంటాడు. అయితే  మీరు ఆ విషయం దాచి అతడి డబ్బు పుగాకు వ్యాపారంలో  నష్టం  వచ్చింది కనక  ఇవ్వలేదని చెప్పివుంటారు. ఈ రెండు  భావాలు  అతడి  బుర్రలో కదిలి రూపాతరం చెందాయి. అందువల్లే  గోల్డుమెడలూ .... పుగాకు  వ్యాపారం  అంటున్నారు.
    "అంటే డాక్టరుగారూ! మా  అల్లుడికి  నా వల్లనే  పిచ్చెక్కిందంటారా?' పిచ్చయ్య బాధగా  అన్నాడు.
    "అంతకుముందే  అస్తవ్యస్తంగా  వున్న అతడి  మానసిక స్థితి ఈ కారణంగా అల్లకల్లోలం అయింది."
    "నయమవుతుందంటారా బాబూ?" అంతవరకూ అల్లుడు నాటకం  ఆడుతున్నాడని నిర్లక్ష్యంగా ప్రవర్తించిన పిచ్చయ్య అల్లుడికి  నిజంగానే  మతిపోయిందని  తెలిసి   దిగాలు పడిపోయాడు.
    "తప్పకుండా  నయమౌతుంది. కాని అందుకు మీరు మీ అల్లుడి  ముందు నిజం  అంగీకరించాలి. ఆ తర్వాత  నేను  చెయ్యాల్సిన వైద్యం చేస్తాను. ఇక మీ రెళ్ళవచ్చు" అని డాక్టరు.....అప్పారావు వున్న గదిలోకి  వెళ్ళాడు.
    అప్పారావును లేపి తండ్రితో  బయటికి పంపించాడు.
                                                    3
    "జయంత్ పద  రౌండ్సుకెళ్దాం!" అంటూ డాక్టరు ఉదయచంద్ర  లేచాడు. జయంత్ డాక్టర్ను అనుసరించాడు. నర్సుకూడా  వెనకే  బయలుదేరింది.
    "సిస్టర్!"
    "సర్!" ఏదో నంబరు గది...."
    "అది నేను చూసుకుంటాలే. పదకొండో నంబరు గదిలో పేషెంట ఎలా వున్నాడో చూడు."
    "చాలా భయంకరంగా వున్నాడు సర్.అతడ్ని  ప్రభుత్వ  ఆసుపత్రిలో చేర్పించాల్సిందే."
    "నేనూ అదే అనుకుంటున్నా. నువ్వెళ్ళు నేను ఇప్పుడే వస్తా ."
    నర్సు గ్రేస్ ముసిముసిగా  నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ నవ్వు  చూసిన డాక్టరుకు  ఒళ్ళుమడింది, మధ్యలో  ఈవిడోకర్తి. తను  ఆ పిల్లను ప్రేమిస్తున్నట్టు ఊహించుకుంటూ, ఆ పిల్ల పేరెత్తగానే తెగ  మురిసిపోతుంది.
    డాక్టర్ ఉదయచంద్ర ఏడవ  నంబరు గదిలోకి వచ్చాడు.
    "హల్లో మససీ.....గుడ్  ఈ వెనింగ్!"
    "గుడ్ ఈ వెనింగ్ డాక్టర్! వెరీగుడ్  ఈవెనింగ్ " తల్లో  మల్లెపూల  చెండును తురుముకుంటూ ఓరగా చూసి  అన్నది. డాక్టరు  జయం గదిముందు నిలబడిపోయాడు.
    మానసి డాక్టర్ని చూస్తూ వుండిపోయింది.
    "ఎలా వున్నావ్ మానసీ?"
    "మీరే చెప్పాలి."
    నవ్వితే ముత్యాలు  రాలిపోతాయన్నట్టుగా  మందహసాన్ని  పెదవులో మధ్య బంధించి  కళ్ళు అలవోకగా తిప్పింది.
    "బ్యూటిపుల్ ___ఈ చీరలో చాలా అందంగా వున్నావు......"
    "మీరడిగింది....." మానసి  చెక్కిళ్ళు ఎరుపెక్కాయి.
    "నీ ఆరోగ్యాన్ని గురించి..."
    "మరి అందాల్ని వెతుకుతున్నారేం?"
    చచ్చాం ఇదేదో ప్రేమ  వ్యవహరంలా వుంది. డాక్టర్  ఉదయ్ పిచ్చిదాన్ని  ప్రేమించడం ఏమిటి? డాక్టర్  జయంత్  రెండడుగులు  వెనక్కు  వేసి గది  బయటకొచ్చి నిల్చున్నాడు.
    "మాట్లాడరేం?"
    "నన్ను చెప్పమన్నావుగా? మరి నా కళ్ళకు కనిపిస్తున్నది అందమే. ఇక నేను  అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు"
    "నాకు చాలా హాయిగా వుంది డాక్టర్. మీ నర్సింగ్ హొంలో ఇంత ప్రశాంతత లభిస్తుందనుకోలేదు. పిచ్చివాళ్ళ నర్సింగ్ హొమ్ కు "ప్రశాంత నర్సింగ్  హొమ్" అని పేరు   పెట్టేరేమిటా అని ఇక్కడ  అడుగు పెట్టగానే అనుకొన్నాను. చెప్పకపోవడం  ఎందుకూ......నాకు  నవ్వుకూడా వచ్చింది. కాని పిచ్చివాళ్ళకు  నిజంగా కావాల్సింది మానసిక ప్రశాంతలే అది ఇక్కడ  దొరుకుతుంది."
    "మానసీ.....ఇక్కడకు వచ్చేవాళ్ళు పిచ్చివాళ్ళు కారు. తాత్కాలికంగా మానసిక  శాంతిని కోల్పోయిన వాళ్ళు  ఇక్కడికొస్తారు. ఇక్కడకు  చికిత్సకోసం  వచ్చిన వాళ్ళకు పిచ్చివాళ్ళనే  ముద్ర  వెయ్యవలసిన పనిలేదు. ఆ మాటకొస్తే ఇక్కడకు  రానివాళ్ళు, చాలామంది పిచ్చివాళ్ళు, మంచివాళ్ళు మధ్యలో తిరుగుతూ వుంటారు."
    "మీరు బలేగా  మాట్లాడతారుడాక్టర్."
    "అవును! మానసీ. సరిగా  అర్థంచేసుకుంటే  తలనొప్పి, జలబు, జ్వరంకంటె  చిన్న చిన్న  మానసిక అవకతవకలు ప్రమాదకరమైనవి కావు. కొన్ని సందర్భాలో ఆ వ్యాదులకంటే ఇవి  త్వరగా  నయం అవుతాయి."
    "చాలా సందర్భాల్లో  ఈ వ్యాధులు  జీవితాంతం వెంటబడ్తాయి డాక్టర్."
    "దానికి కారణం  సరైన  సమయంలో  చికిత్స  తీసుకోకపోవడమే సమయంలో చికిత్స  తీసుకుంటే  నూటికి  తొంభై కేసులు  నయమవుతాయి."
    "నిలబడే  వున్నారు కూర్చోండి డాక్టరుగారూ"  మానసి డాక్టరు  ఉదయ్ ముందుకు కుర్చీ  జరిపింది.
    "రేపు  ఉదయం  వెళ్తున్నాం" డాక్టర్ ఎదురుగా  కూర్చుంటూ అన్నది  మానసి.
    "యస్.యస్. మీ నాన్నగారు  చెప్పారు. అన్నట్టు శివరామయ్యగా రెక్కడ?"
    "బజారు కెళ్ళారు. వచ్చేస్తారు. వెళ్ళేముందు మిమ్మల్ని కలుసు కోవాలనుకుంటున్నారు. ఆఁ! అదుగో  రానే వచ్చారు" సంతోషంగా  అన్నది మానసి.   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS