Previous Page Next Page 
నిశాగీతం పేజి 3


    "మీరు మాట్లాడకండి. ఆఁ అయితే శివతాండవం....సారీ! నీ  పేరేమిటి?"
    "చిదానంద స్వాములవారు."
    "ఇదండీ వరస....." అంటూ డాక్టరు చురచుర చూడటంతో వాక్యం  పూర్తిచెయ్యకుండా ఆగిపోయాడు శివతాండవం తండ్రి.
    "శివ.....సారీ.....చిదానందస్వామిగారూ! మీరు కొంచెం లోపలకు వస్తారా?" అంటూ శివతాండవాన్ని డాక్టర్ ఉదయచంద్ర యాంటీ రూంలోకి తీసుకెళ్ళాడు. అయిదు నిముషాలతర్వాత డాక్టర్ బయటికి వచ్చాడు.
    "ఇప్పుడు చెప్పండి."
    "ఏం చెప్పమంటారు బాబూ? ఆరు నెలల క్రితమే తను చచ్చిపోయాననీ, అదే  సమయంలో నిర్వాణం చెందిన చిదానందస్వామి ఆత్మ తనలో ప్రవేశించిందనీ అంటాడు."
    "ఆరు నెలల క్రితం ఏదైనా సంఘటన జరిగిందా?"
    "ఏం లేదు బాబూ! ఏదో విషజ్వరంతో ఒక వారంరోజులు బాధపడ్డాడు. ఆ తర్వాత భార్యను మీరనీ, తల్లీ మాతా, అని  పిలవడం ప్రారంభించాడు తను చచ్చిపోయాననీ, ప్రస్తుతం తను తాను కాదనీ, చిదానందస్వామిననీ చెప్పుసాగాడు. ఆరు నెలలనుంచి ఇదే తంతు ఎప్పుడూ పూజంటూ కూర్చుంటాడు. గంటలకొద్దీ లేవడు."
    "అంతకుముందు ఎలా వుండేవాడు?"
    "చాలా తెలివైనవాడు. ఉద్యోగం సవ్యంగానే చేసుకునేవాడు ఇప్పుడు ఆఫీసుకు వెళ్ళడంకూడా మానేశాడు."
    "అది సరేనండీ. పూజలు చేసేవాడా? భగవంతుడు కన్పించాడని చెప్పేవాడా?" డాక్టర్ ప్రశ్నించాడు.
    "లేదండి. అయితే మా పక్కింటివారి కోడల్ని తనకు మూడు జన్మల క్రితం తల్లి అనేవాడు. మూడు జన్మల భార్యలు ఇప్పుడుఎక్కడో వున్నారని, అప్పుడప్పుడు తనను తీసుకెళ్తారనీ అంటూ వుండేవాడు."
    "ఎక్కడ వున్నారనేవాడు?"
    "ఏం చెప్పమంటారు బాబూ! ఒక భార్యా మత్స్య కన్యట మరో భార్య నాగకన్యట. వాళ్ళిద్దరూ తనను పోటీలమీద వాళ్ళ లోకాలకు తీసుకెళ్తారట."
    "మూడో భార్య ఎవరట?"
    "ఈ ఊళ్ళోనే ఉన్నదట. ఒక లాయరుగారి భార్యట."
    "ఆమెకూడా అతడ్ని తీసుకెళ్తుందనేవాడా?"
    "లేదు డాక్టర్. ఆమెకు తను కనిపిస్తే అలాంటి ప్రమాదమే ఏదో జరుగుతుందనీ, అందుకే ఆమెకు కన్పించకుండా జాగ్రత్త పడ్తున్నాననీ అనేవాడు."
    "మరి ముందే సైకియాట్రిస్టును ఎందుకు కన్ సల్ట్ చెయ్యలేదూ?"
    "ఆఁ ఆలోచనే మాకు రాలేదు. పైగా మిగతా అన్ని విషయాల్లో మామూలుగానే వుండేవాడు. సర్దాకు కట్టుకథలు చెపుతున్నాడని భావించాం. కానీ ఇంత ముంచుకొస్తుందనుకోలేదు. మావాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడంటారా?"
    "తప్పకుండా అవుతాడు. అయితే కొంత ఆలస్యం కావచ్చును సిస్టర్! శివతాండవాన్ని పిలువు" అన్నాడు డాక్టర్.
    "ఇంతకీ మావాడి జబ్బేమిటి బాబూ?"
    "స్కిజో ఫ్రేనియాలో ఇదో రకం. పేర్లు తెలుసుకొని మీరేం చేస్తారు? మీ అబ్బాయి వచ్చాడు. మళ్ళీ మంగళవారం తీసుకురండి."
    విజిటర్స్ గదిలోనుంచి కేకలు విన్పించసాగాయి.
    డాక్టర్ లేచి బయటికి వచ్చాడు.
    అప్పారావు మామమీద అరుస్తున్నాడు. డాక్టర్ ఉదయచంద్ర అప్పారావు భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా తట్టాడు.
    అప్పారావు డాక్టరు కళ్ళల్లోకి చూస్తూ వుండిపోయాడు కొద్ది క్షణాలు.
    "చూడండి డాక్టరుగారూ! ఈ పిచ్చివాళ్ళిద్దరూ చేరి నన్ను పిచ్చి వాడ్ని చేస్తున్నారు" అప్పారావు ఎంతో బాధగా అన్నాడు.
    "డోంట్ వర్రీ మిస్టర్ నేనున్నానుగా? వాళ్ళు నిన్నేమీ చెయ్యలేరు. నీకు అండగా నేను నిలబడ్తాను. సరేనా?" అప్పారావు భుజంతట్టాడు. అతడికి దైర్యాన్ని చెపుతున్నట్టుగా
    మంచి సైకియాట్రిస్టు రోగులకు తాను ఆత్మీయుడు నమ్మకాన్ని ముందు కలిగిస్తాడు. అప్పుడే మానసిక వైద్యుడు తన వృత్తిధర్మాన్ని సవ్యంగా నిర్వహించగలడు.
    డాక్టరు చూపులు అప్పారావులో డాక్టర్ పట్ల నమ్మకాన్ని కలిగించాయి.
    "కమ్ విత్ మీ!" డాక్టర్ అప్పారావును తనతో తీసుకెళ్ళాడు.
    "పోండిరా వెధవాయిల్లారా!" అన్నట్టు  అప్పారావు తండ్రినీ,  మామనూ ఓ క్షణం చూసి తల  పైకెత్తి గర్వంగా డాక్టర్ వెనకే కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళాడు.
    వారి వెనకే డాక్టర్ గదిలోకి అడుగు పెట్టబోతున్న ఇద్దర్నీ డాక్టర్ చూపుల్తోనే వారించాడు. ఇద్దరూ బయటికి వచ్చారు.
    అప్పారావు డాక్టర్ కు ఎదురుగా కూర్చున్నాడు.
    డాక్టర్ అప్పారావు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ "మీ పేరు?" అన్నాడు.
    "మిస్టర్ అప్పారావు."
    "మిస్టర్" అనే పదాన్ని నొక్కిచెప్పాడు.
    "వయసు?"
    ఎల్లో కార్డుమీద నోట్ చేసుకుంటున్నాడు డాక్టర్.
    అప్పారావు వంగి కార్డు చూస్తూ "మిస్టర్, మిస్టర్ అప్పారావు అని వ్రాయండి" అన్నాడు.
    "యస్. యస్  మిస్టర్ అప్పారావ్! అలాగే వ్రాశాను చూడండి" ఉదయచంద్ర చిరునవ్వుతో అప్పారావుకు కార్డు చూపించాడు.
    అప్పారావు ముఖంలో సంతృప్తి కన్పించింది.
    "ఆఁ వయసు?"
    "ఇరవ్ ఆరు ఐ మీన్ రన్నింగ్ ట్వంటీ సిక్స్ ట్వంటి ఫైవ్ గాన్, ట్వంటీ సెవెన్ చూడు అప్పారావ్?"
    "మిస్టర్ అప్పారావ్! సే! మిస్టర్ అప్పారావ్!" డాక్టర్ను కరెక్టుచేస్తున్నట్టుగా అన్నాడు.
    "సారీ! చూడు మిస్టర్ అప్పారావ్!"
    "ఊఁ ఏమిటి?"
    "నీకు పెళ్ళయిందా?"
    "దటీజ్ ద హొల్ ప్రాబ్లమ్."
    "డాక్టర్  నొసలు ఎగరేశాడు.
    "అవును సార్! అదే ప్రాబ్లమ్!"
    "ఇంతకీ  పెళ్ళికాక ప్రాబ్లమా? పెళ్ళి అయ్యా?"
    అప్పారావు పెద్దగా నవ్వాడు.
    డాక్టర్, అప్పారావు ముఖంలోకి చూశాడు.
    "మీరు భలేవారు డాక్టర్! పెళ్ళికాకపోతే ప్రాబ్లమే లేదు. పెళ్ళి అయ్యింది కనుకనే ప్రాబ్లమ్ అస్డలు పెళ్ళయ్యాకే అన్ని ప్రాబ్లమ్సూ మొదలయ్యాయి" అని ఏదో చెప్పబోయి అప్పారావు ఆగిపోయాడు.
    "చెప్పండి అప్పారావ్."
    "మిస్టర్ అప్పారావు."
    "సారీ! మిస్టర్ అప్పారావు" డాక్టర్ వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు.
    "ఊఁ అడగండి" అన్నాడు అప్పారావు.
    "మీ సమస్యలేమిటో చెప్పండి."
    "మీతో చెప్పుకుంటే......మీరేమైనా......."
    "నేనేమైనా సహాయపడగలనేమో చూస్తాను" మధ్యలోనే అందుకొని అన్నాడు డాక్టర్ అతడి కంఠంలో ఎంతో సానుభూతి ధ్వనించింది.
    థాంక్యూ డాక్టర్!" అప్పారావు ఆలోచనలో పడ్డాడు.
    "మిస్టర్ అప్పారావ్!"
    "ఊఁ!"
    "చెప్పండి."
    అప్పారావు ఆలోచనలోనే వుండిపోయాడు.
    "మీకు మీ భార్య అంటే ఇష్టమేనా?"
    ఉలిక్కి పడ్డాడు అప్పారావు.
    "మామగాడంటేనే ఇష్టంలేదు."
    " డాక్టర్ అప్పారావు ముఖంలోకి పరిశీలనగా  చూస్తూ"ఎందుకని?" అన్నాడు.
    "వట్టి మీన్ ఫెలో! నా గోల్డ్ మెడల్ కాజేశాడు. మేథమాటిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది."
    "వెరీగుడ్! నువ్వు చాలా తెలివైనవాడివి." కంఠంలో ప్రశంస ధ్వనించినా కళ్ళల్లో ఎంతో జాలి నిండివుంది.
    "మా మామ నా గోల్డ్ మెడల్ అమ్మి లంక పొగాకు కొనుక్కున్నాడు. రండి! చూపిస్తా" అంటూ లేచి నిలబడ్డాడు.
    "నువ్వు కూర్చో మిస్టర్ అప్పారావ్. మీ మామగారితో నేను  మాట్లాడతాలే."
    సర్ది చెబుతూ కూర్చోబెట్టాడు డాక్టర్.
    గది బయట హాల్లో అప్పారావు తండ్రీ, మామా ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు.
    అర్ధగంట తర్వాత బాయ్ వచ్చి వాళ్ళిద్దర్నీ లోపలకు పిల్చాడు.
    తండ్రిని పక్కగదిలో  పడుకున్నఅప్పారావు దగ్గరకు పంపించాడు. అతడ్ని అనుసరిస్తున్న అప్పారావు మామను "మీరు వుండండి" అన్నాడు డాక్టర్.
    "మీ అల్లుడికి ఇస్తానన్న కట్నం ఎందుకివ్వలేదూ?"
    ఈ ముక్కుసూటి ప్రశ్నకు అప్పారావు మామ గాభరపడ్డాడు.
    "చెప్పండి."
    "అలా అని మీకు చెప్పాడా  డాక్టరుగారూ?"
    "అవును. అలాగే చెప్పాడు. అసలు విషయం ఏమిటి?"
    "అయ్యా డాక్టర్ గారూ......కట్నం డబ్బు పువ్వులో పెట్టి అప్పజెప్పాను. కావాలంటే మా వియ్యంకుడ్ని అడగండి. ఇక్కడే వున్నాడుగా?" లబలబ లాడిపోయాడు.
    "మరి! ఆఁడబ్బేమైంది?"
    "అల్లుడే స్వయంగా వచ్చి వ్యాపారంలో వాటా తీసుకున్నాడు."
    "వ్యాపారమా?" ఆశ్చర్యంగా అడిగాడు ఉదయచంద్ర.
    "అవును. డాక్టరుగారూ. నేను లంక పుగాక వ్యాపారం చేస్తుంటాను. నిరుడోచ్చి కట్నం బాపతు డబ్బు వ్యాపారంలో పెట్టి వాటా తీసుకున్నాడు. అల్లుడుకూడా కలిశాడని పుగాకు కొనుగోలు ఎక్కువచేశాను. నిరుడు ఎగుమతి దెబ్బతినడంవల్ల రేటు బాగా పడిపోయింది. బ్యాంకు వడ్డీలూ, అప్పులూ తీర్చేసరికి  వట్టి మనిషిని మిగిలాను. ఆ తర్వాత అతడికి పిచ్చెత్తి ఇలా నా వెంటపడ్డాడు. డాక్టరుగారూ" పై పంచ తీసి ముఖానికి పట్టిన చమట తుడుచుకున్నాడు.
    "మరి మీకెక్కలేదేం?"
    తృళ్ళిపడ్డాడు.
    "ఏమిటేక్కేది?" తెల్ల ముఖం వేశాడు.
    "అదే! మీ అల్లుడికి ఎక్కిందన్నారుగా?"
    "పిచ్చా?" పిచ్చిగా చూశాడు. ఆ పెద్దమనిషి ఏడుపోక్కటే తక్కువ.
    "అవును అదే. మీ పేరేమిటి?"
    "పిచ్చయ్య."
    "మీ పేరు?" డాక్టరు పరధ్యానంగా అన్నాడు.
    "పిచ్చయ్య, పిచ్చయ్య" పిచ్చయ్య నొక్కి నొక్కి చెప్పాడు.
    "సరి! సరి! అప్పారావును నర్సింగ్ హొమ్ లో అడ్మిట్ చేస్తే మంచిది. పది రోజులు నేను అతడ్ని రోజూ చూడాలి. ఏమంటారు?"
    "ఇప్పుడే వస్తా!" అని పిచ్చయ్య పక్కగదిలోకి వెళ్ళాడు.
    వియ్యంకుడితో సంప్రదించి కొద్ది నిమిషాల తర్వాత వచ్చాడు.
    "మీరు చెప్పినట్టే చేస్తాం డాక్టరుగారూ!" అన్నాడు పిచ్చయ్య.
    డాక్టర్ నర్స్ ను పిల్చి "ఏడో నెంబరు బెడ్ ఖాళీ అయిందికదూ?" అన్నాడు.
    "ఇంకా కాలేదు సార్! రేప్పొద్దున వెళ్తారట" అన్నది డాక్టర్ని అదోలా చూస్తూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS